ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మార్గదర్శి అక్రమాల కేసుకు సంబంధించి తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వారిపై ఉండవల్లి అరుణ్ కుమార్ నాలుగురోజుల క్రితం స్పందించి ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. మార్గదర్శిపై సమావేశం పెడితే తనను పిలిస్తే మార్గదర్శి తప్పేంటో చెబుతానని, ఒకవేళ తన వాదనలో పస లేదని నిరూపిస్తే కేసు విత్ డ్రా చేసుకుంటానని ఉండవల్లి చెప్పారు. దీనికి తాజాగా టీడీపీ “సై” అంది!
అవును… “చంద్రబాబు… మార్గదర్శి వ్యవహారాలపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో చంద్రబాబు ఎవరినైనా చర్చకు పంపాలి. సింగపూర్, దుబాయ్ లో చంద్రబాబు ఆస్తులు, వ్యాపారాలు లాంటి కష్టమైన ప్రశ్నలు ఏవీ నేను అడగను. టీడీపీ ప్రభుత్వంలో వ్యవహారాలపైనే అడుగుతా” అని సవాల్ విసిరారు. అయితే దీనికి తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి… బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తేదీ, సమయం, స్థలం నిర్ణయించాలని ఉండవల్లికి సూచించారు.
దీంతో జీవీ రెడ్డి ప్రతిస్పందనపై ఉండవల్లి తాజాగా రాజమండ్రిలో రియాక్ట్ అయ్యారు. తనతో డిబేట్ కు జీవీరెడ్డి సిద్ధం కావడం సంతోషమని.. బహిరంగ చర్చకు తాను రెడీ అని ఆయన చెప్పారు. అయితే ఈ సందర్భంగా వేదిక విషయంలో కొన్ని ప్రాధాన్యతలను ఆయన మీడియా ముందుంచారు.
ఈ బహిరంగ చర్చకు రామోజీరావుకు సంబంధించిన ఫిల్మ్ సిటీలో పెడితే బాగుంటుందని అభిప్రాయపడిన ఉండవల్లి… దీనికి రామోజీని ఒప్పించే స్థాయి తనకు కానీ, టీడీపీ నేత జీవీరెడ్డికి కానీ లేదని తేల్చారు. చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని రామోజీతో మాట్లాడితే ఆయన ఒప్పుకుంటారని ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో రామోజీకీ ఒక ఆఫర్ ఇచ్చారు ఉండవల్లి. ఆయన సంస్థలో జరిగిన అక్రమాలపై జరుగుతున్న ఈ డిబేట్ లో రామోజీరావు పాల్గొనవచ్చని.. అవసరమైతే ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. సీఐడీ దర్యాప్తు సందర్భంలో బెడ్ పై పడుకున్నట్లుగా, తమ డిబేట్ లో కూడా ఆయన పడుకుని పాల్గొనవచ్చని ఉండవల్లి చెప్పారు! ఇది గోదావరి జిల్లా వెటకారామా.. లేక, సీరియస్ గానే అన్నారా అన్నసంగతి కాసేపు పక్కనపెడితే… ఉండవల్లి తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అయితే… చంద్రబాబు మాటను సైతం రామోజీ లెక్కచేయని పక్షంలో.. వేదిక ఫిల్మ్ సిటీ నుంచి తెలుగుదేశం కార్యాలయానికి మార్చినా పర్వాలేదని ఉండవల్లి తెలిపారు. అది కూడా ఛాన్స్ లేనిపక్షంలో… బహిరంగంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించొచ్చని చెప్పిన ఉండవల్లి… వచ్చే నెల 14న ఆదివారం డిబేట్ కు తాను సిద్ధమని ప్రకటించారు.
దీంతో… దీని తర్వాత పరిణామం ఏమిటి? ఈ చర్చను ఎవరు లీడ్ చేస్తారు? ఎవరు ముందుకొచ్చి వేదిక ఏర్పాట్లు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.
కాగా… టీడీపీలో డబ్బున్న నేతలు, పదవులు పొందడానికి మాత్రమే అర్హులైన నాయకులు, ఎంతో సీనియర్లు, టీవీ ఛానల్స్ లో మేధావులమని చెప్పుకుంటూ ఊకదంపుడు ఉపన్యాశాలు, అడ్డగోలు వాదనలు చేసే వారు, “కమ్మ”టి కబుర్లు చెప్పేవారు మాత్రమే ఉన్నారని… ఉండవల్లి అరుణ్ కుమార్ ఛాలెంజ్ పై వారంతా కలుగుల్లో దాక్కోగా… జీవీ “రెడ్డి” బయటకు రావడం గొప్ప విషయమని ఆయన్ని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!