Pushpa 2 Producers: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలోనే హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీ తేజ అనే బాలుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే రెండు వారాల నుంచి శ్రీ తేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఇప్పటికే పలువురు సినిమా సెలబ్రిటీలు హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప 2 సినిమా నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై చాలా బాధ పడ్డాము. రేవతి గారు చనిపోవడం దురదృష్టకరం. బాబుని చూడటానికి వచ్చాము. అతను రికవరీ అవుతున్నాడు. వాళ్ళ కుటుంబానికి సహాయం ఉండాలని మా వంతు సహాయంగా ఇది అందచేస్తున్నాము అంటూ 50 లక్షల రూపాయల చెక్కును శ్రీ తేజ తండ్రికి మైత్రి మూవీ క్రియేషన్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ అందించారు. అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. ఈ విషయాన్ని రాజకీయం చేయడం, రాజకీయ నాయకులు ఈ అంశంపై మాట్లాడడం ఆపేయాలి.
అల్లు అర్జున్ ఇంటిపై జేఏసీ నేతలు దాడి ఖండిస్తున్నాను. సినీ హీరో అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. ఇళ్ల పై దాడులు చేస్తే చర్యలు తప్పవు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలి. ఇలాంటి ఘటనల విషయంలో పోలీసు శాఖ వారి పని వారు చేసుకుంటారు. తెలంగాణలో సినీ పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకెళ్తాము. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ప్రతినిత్యం ఆరా తీస్తున్నారు. రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేము. బాలుడు శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. శ్రీ తేజ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని ఆయన అన్నారు. అయితే 50 లక్షలు చెక్కును అందజేయడం పట్ల అభిమానులు నెటిజన్స్ స్పందిస్తూ ఇప్పటికి మంచి పని చేశారు ఆ ఫ్యామిలీకి చాలా అండగా నిలిచారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.