దుబ్బాకలో కాంగ్రెస్ పోటీకి దిగడం తప్పంటారా.. ఎందుకు ?

Congress
మన దేశ రాజకీయాల్లో కేవలం ఐడియాలజీలు, విధి విధానాలు, వ్యక్తిగత చరీష్మాలకు మాత్రమే కాదు సెంటిమెంట్లకు కూడా చోటుంది.  ఈ సెంటిమెంట్లు ప్రధానంగా కుటుంబ రాజకీయాల విషయంలో బాగా పనిచేస్తాయి.  ఒక్కోసారి ఇవి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేలా ఉంటాయి.  ఇప్పుడెందుకు ఈ సెంటిమెంట్ రాజకీయాలు అంటారా.. దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది కాబట్టి.  దుబ్బాకలో సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు.  దీంతో ఆ చోటు ఖాళీ అయింది.  అప్పటి నుండి ఆ స్థానంలో ఉపఎన్నికలు జరుగుతాయా లేకపోతే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం నుండే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా అనే సందేహాలు మొదలయ్యాయి.  ప్రజల్లోనే కాదు  స్వయంగా ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
ramalingareddy
 
సోలిపేట రామలింగారెడ్డి చాలా మంచి వ్యక్తి, ఆయన అకాల మరణం చెందారు కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానం వారి కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఇవ్వాలనేది కొందరి వాదన.  అలా చేయడమే దివంగత రామలింగారెడ్డికి ఇచ్చే అసలైన నివాళి అని అలా కాకుండా ఆ స్థానం కోసం పోటీకి దిగితే అంతకంటే దారుణం, కక్కుర్తి మరొకటి ఉండదని, అలా చేస్తే రామలింగారెడ్డిగారిని అవమానించడమే అవుతుందని వాదిస్తున్నారు.  కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి సైతం రామలింగారెడ్డి కుటుంబంలో ఎవరినైనా ఎమ్మెల్యేను చేస్తామంటే ఎన్నికను ఏకగ్రీవం చేసేలా పార్టీ పెద్దలతో తాను మాట్లాడతానని అన్నారు.  కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తాము ఎన్నికల్లో నిలుస్తామని ప్రకటించారు. 
 
ఇది హైకమాండ్ నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని బల్లగుద్ది చెప్పారు.  దీంతో ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల దాడి మొదలైంది.  రామలింగారెడ్డి లాంటి గొప్ప నేత మరణిస్తే ఆయనకు నివాళిగా ఆ స్థానాన్ని ఆయన కుటుంబానికే వదిలెయ్యాలి కానీ ఇలా రాజకీయ స్వార్థంతో ఉపఎన్నికలకు సిద్దమవుతారా అంటూ విరుచుకుపడుతున్నారు.  మరి ఇన్ని విమర్శలకు గురవుతున్న ఉపఎన్నికల్లో నిలవాలనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సరైనదా కాదా, నైతికమా అనైతికమా అంటే సరైన, నైతికమైన నిర్ణయమనే అనాలి.  ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం.  ఇక్కడ సెంటిమెంట్లకు తావు ఉండదు.  సానుభూతికి చోటు అసలే ఉండదు.  ఏదైనా రాజ్యాంగం మేరకే జరగాలి. 
 
రాజ్యాంగంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానాన్ని మరణించిన వారి సభ్యులకే వదిలెయ్యాలనే నియమం లేదు.  కాబట్టి దుబ్బాకలో ఉప ఎన్నికలకు వెళ్లాలనే కాంగ్రెస్ నిర్ణయం ఏమాత్రం తప్పు కాదు.  అయినా రాజకీయాల్లో పోటీ అనేది భావజాలం, విధివిధానాలు, అభిప్రాయాల పరంగా ఉంటుందే కానీ వ్యక్తిగతం ఎప్పుడూ కాదు.. కాకూడదు.  ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానంలో పోటీకి నిలబడటం మరణించిన ఆ ఎమ్మెల్యేను అవమానించడం కాదు.  ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఛాయిస్ ఉండాలి, పోటీ ఉండాలి అప్పుడే స్వేచ్ఛ, పారదర్శకత శాతం పెరుగుతాయి.  ప్రజలు, పార్టీలు సైతం ఎన్నికలు అనేవి కేవలం రాజకీయపరమైనవే కానీ వ్యక్తిగతం కావని గుర్తుంచుకోవాలి.  జరగబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, గెలవకపోవచ్చు.. కానీ పోటీలో నిలబడటం అనేది వారికి ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు.  
 
ఆ హక్కు మేరకే వారు పోటీలో నిలువడానికి రెడీ అయ్యారు.  వారిని పోటీలో ఉండవద్దని ఎవరైనా అంటే అది వారి హక్కును కాలరాయడం, అప్రజాస్వానికమే అవుతుంది.  పైగా మన రాజకీయ నేతలు, ప్రజలు వారసత్వ రాజకీయాలను ప్రొత్సహించవద్దని, అవి ప్రమాదమని పదే పదే అంటూ ఉంటారు.  వారే ఇప్పుడు వ్యవస్థ పదవులను వారసత్వం కింద వదిలేయాలని అనడం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టడం సమంజసం కాదు.  పైగా వారసులకు వదిలేయడానికి అదేమీ ప్రభుత్వ ఉద్యోగం కాదు.. ప్రజాస్వామిక పదవి. ప్రజల ఓటింగ్ ద్వారానే ఎన్నిక జరగాలి.  ఏకగ్రీవమంటూ జరిగితే పోటీదారులు లేనప్పుడే జరగాలి.  అంతేకానీ బలవంతంగా, సెటిమెంట్, సానుభూతి లాంటి కారణాలు చూపి ఏకగ్రీవం అనడం సరైంది కాదు.