సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. మంగళవారం జరిగిన ఈ ప్రమాదం తల్లిదండ్రులకు బాధ కలిగించినా, బుధవారం ఉదయం అతడి ఆరోగ్యంలో మెరుగుదల రావడంతో కొంత ఊరట వచ్చింది. మార్క్ ఆరోగ్యంపై ఫోటో ఒకటి బయటకు రావడంతో అభిమానుల హృదయాలకు కొంత ఆశ వచ్చింది.
సమ్మర్ క్యాంప్‌లో మంటలు చెలరేగిన సమయంలో 15 మంది చిన్నారులు గాయపడగా, అందులో ఒక బాలిక ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. మంటల మధ్యనుండి బయటపడిన మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగను పీల్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించగా, బుధవారం ఉదయం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో మార్క్ ఆరోగ్యం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కాస్త ఊరట కలిగించేలా ఒక ఫొటో బయటకు వచ్చింది. ఆసుపత్రి బెడ్ మీద కూర్చున్న మార్క్ శంకర్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్నా, రెండు చేతులతో ఛీర్స్ చెప్పేలా కనిపించాడు. కుడి చేతికి కట్టె ఉన్నా, ముఖం ప్రశాంతంగా ఉండటంతో ఆరోగ్యం నిలకడగా ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ ఫొటో బయటకు రావడంతో పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సింగపూర్‌కు వెళ్లిన పవన్, చిరంజీవి ఇద్దరూ మార్క్‌ను ఆసుపత్రిలో చూసి వచ్చారు. బాలుడి పరిస్థితి మెరుగుపడుతున్నట్టు వైద్యుల మాటలు కూడా ధైర్యం కలిగించాయి.

