తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా నటుడిగా, నిర్మాతగా సుస్థిరంగా కొనసాగుతున్న రాజీవ్ కనకాల తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ‘హోమ్ టౌన్’ అనే సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యిన ఆయన, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అసలు విషయాలు బయటపెట్టారు. 1988లో తన తండ్రి భవనాన్ని కొనుగోలు చేసే విషయంలో మోసపోయారని రాజీవ్ తెలిపారు.
అప్పట్లో 40 లక్షల అప్పుని వడ్డీకి తెచ్చి ప్రాపర్టీ కొన్నా కానీ, చివరకు మోసపోయారని చెప్పారు. “నెలకు 30-40 వేల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వచ్చేది. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. నాన్నగారు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని, ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఆయనకు ధైర్యం చెప్పాను” అంటూ ఓ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు.
వీటి మధ్యంలో ఆయన, తన భార్య సుమ కనకాల విడిపోయారని వచ్చిన పుకార్లపై స్పందించారు. “కొన్ని కారణాల వలన నేను మా నాన్నతో కలిసి పాత ఇంట్లో ఉన్నాను. అదే సమయంలో నేను సుమ విడాకులు తీసుకున్నానని పుకార్లు రాగా, అవి పూర్తిగా అసత్యం. మా వ్యక్తిగత జీవితం గురించి ఊహించుకుని ఎలా కావాలంటే అలా ప్రచారం చేస్తున్నారు” అని ఆయన చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆస్తుల విషయానికొస్తే.. “మా దగ్గర పెద్దగా ఆస్తులు లేవు. మాకు ఉన్నది ఒక్క ఇల్లు మాత్రమే. కానీ కొంతమంది తమ వెంచర్‌లో ప్లాట్లు అమ్మేందుకు మా పేరు వాడుతున్నారు. వాళ్లే కస్టమర్లకు ‘సుమ-రాజీవ్ కనకాల వాళ్లు ప్లాట్లు కొనుగోలు చేశారు’ అని చెబుతున్నారు. దాంతో మాకు పెద్ద ఆస్తులు ఉన్నాయని అనుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ అవాస్తవ ప్రచారమే” అని ఆయన తేల్చి చెప్పారు.