బీజేపీ జతకడితే… బాబు ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే!

ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదింపాలని టీడీపీ – జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ పొత్తుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వంటి బలమైన పార్టీ మద్దతు కూడా తోడవ్వకపోతే సమస్యలు తప్పవని టీడీపీ – జనసేనలు భావిస్తున్నాయని అంటూన్నారు. దీంతో చంద్రబాబు, పవన్ ల ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని.. బీజేపీతో పొత్తు కోసం కమళం పెద్దలు చర్చలకు పిలిచారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాబు హస్తిన యాత్ర ఎలాంటి ఫలితాలు తేబోతుందనేది ఆసక్తిగా మారింది.

అయితే బీజేపీతో పొత్తు అంటే అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కానీ కచ్చితంగా ఉత్సాహం చూపిస్తారనేది తెలిసిన విషయమే. అంతవరకూ బాగానే ఉంది కానీ… సీట్ల సర్దుబాట్ల విషయానికొచ్చేసరికి ఎలాంటి సమస్యలు తెరపైకి వస్తాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి 2014 టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీచేసినా… అప్పుడు జనసేన నుంచి అభ్యర్థులు బరిలోకి దిగలేదు. దీంతో ఈ కూటమిలో సీట్ల సర్దుబాట్ల అంశం పెద్ద సమస్యగా మారలేదు.

ఈ క్రమంలో 2014లో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించగా.. అందులో విశాఖ, నర్సాపురం స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే సమయంలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ సారి బీజేపీ అన్ని తక్కువస్థానాలకు అంగీకరించే అవకాశం ఉండదని అంటున్నారు. ఇందులో భాగంగా 2014లో గెలిచిన విశాఖ, నరసాపురం స్థానాలతోపాటు అరకు, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపూర్‌ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో గతంలో గెలిచిన 4 అసెంబ్లీ స్థానాలతోపాటు మరో 10 – 12 స్థానాలు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడే చంద్రబాబుకు అతిపెద్ద సమస్య ఎదురవుతుందని అంటున్నారు పరిశీలకులు. పొత్తుల లెక్కల్లో జనసేనకు 25 స్థానాలతోపాటు. బీజేపీకి 12-15 స్థానాలు ఇవ్వాల్సి ఉండటంతోపాటు… జనసేనకు 2, బీజేపీ కనీసం 6 – 8 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే… సుమారు 40 అసెంబ్లీ 10 లోక్ సభ స్థానాల వరకూ టీడీపీ… దాని మిత్రపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే… పార్టీలో సుమారు 50 మంది ఆశావహులకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. 10 – 15 మందిని బుజ్జగించడం పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ… ఏకంగా 50మంది వరకూ నేతలను బుజ్జగించి సారీ చెప్పడం అనేది సాధ్యంకాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో చంద్రబాబు ఎంతవరకూ సూటిగా, స్పష్టంగా నేతలను విషయం చెబుతారు అనే విషయంపైనే రెబల్స్ లిస్ట్ ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.