అరెస్టు కంటే కూడా లొంగిపోవడమే మంచిది.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ‘దాగుడు మూతల’ వ్యవహారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది.
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి మీద సీబీఐ తీవ్ర ఆరోపణలు చేసింది. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ, అవినాశ్ రెడ్డి విషయంలో ఎందుకు ‘వ్యూహాత్మకంగా’ వ్యవహరిస్తూ, అరెస్టు చేయకుండా వుంటోందన్న అనుమానాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
‘అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడంలేదు’ అని రేప్పొద్దున్న న్యాయస్థానాల్లో గట్టిగా వాదన వినిపించేందుకు వీలుగా సీబీఐ, ఇప్పుడు తప్పించుకునేందుకు అవినాశ్ రెడ్డికి అవకాశాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
‘ఔను, ముందు ముందు అవినాశ్ రెడ్డికి బెయిల్ రావడం కష్టమవుతుంది. అది ఏ రకంగానూ అటు అవినాశ్ రెడ్డికిగానీ, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకిగానీ మంచిది కాదు..’ అన్న చర్చ జరుగుతోంది వైసీపీలో అంతర్గతంగా.
కానీ, వైసీపీ అధినాయకత్వం కూడా అవినాశ్ రెడ్డి ‘దాగుడు మూతల వ్యవహారానికి’ పూర్తి మద్దతిస్తోంది. ఈ ‘దాగుడు మూతల వ్యవహారం’ వల్ల వైసీపీకి ఒరిగేదేంటి.? అవినాశ్ రెడ్డికి కలిగే లాభమేంటి.?