AP: ఇటీవల వైకాపా అధినేత సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ముఖ్యంగా తల్లికి వందనం రైతు భరోసా నిధుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వ హయామంలో ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ఏ పథకం ఎప్పుడు విడుదల చేస్తాము అనేది స్పష్టంగా తెలియజేశాము కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఓటర్లను ఆకర్షించడం కోసమే తప్పుడు హామీలను ఇచ్చి ఇప్పుడు మాట తప్పారు అంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు.
ఇలా ఈయన సంక్షేమ పథకాలు గురించి ప్రశ్నిస్తూ చేసినటువంటి ఈ పోస్టుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన పయ్యావుల కేశవ్ జగన్ తీరుపై విమర్శలు కురిపించారు. కన్నతల్లి ఎదురుపడితే దండం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తల్లికి వందనం గురించి అడగడం చాలా విడ్డూరంగా ఉందని మాట్లాడారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం సూచనలతో 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదల చేశామని అన్నారు. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని పయ్యావు కేశవ్ తెలిపారు. వచ్చిన 5 నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో 5 శాతమైనా జగన్మోహన్ రెడ్డి పోలవరం కోసం పనిచేశారా అంటూ ఈయన ప్రశ్నించారు.పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు, రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.