జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్.. వారాహి విజయయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించిన ఆయన… టీడీపీతో పొత్తు అనంతరం తాజాగా కృష్ణాజిల్లాలో అడుగు పెట్టారు. జిల్లాలోని అవనిగడ్డలో వారాహి యాత్రలో పాల్గొన్నారు. స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా… వైనాట్ 175 కాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు వస్తే చాలా గొప్ప అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. అవనిగడ్డ సభతో వారాహి నాలుగో విడత యాత్రను ప్రారంభించిన ఆయన… అందరూ ఊహించినట్టుగానే జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పనిలో పనిగా.. టీడీపీ – జనసేన కూటమిని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సైకిల్, గ్లాస్ లు కలిసి ఫ్యాన్ ని తరిమేస్తాయని చెప్పుకొచ్చారు.
అనంతరం… ఇటీవల సీఎం జగన్ కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది సిద్ధంగా ఉండండి అంటూ ఇచ్చిన పిలుపును ప్రస్థావించిన పవన్… దానికి కౌంటర్ ఇచ్చారు. కురుక్షేత్రమంటే కురుక్షేత్రమేనని, ఏ యుద్ధాన్నికైనా తాను సిద్ధమని తెలిపారు. యుద్ధం కురుక్షేత్రమే అయితే తాము పాండవులం అని, వందమంది కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వైసీపీ కౌరవ సేన అని కౌంటర్ ఇచ్చారు.
ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేసిన పవన్… అవనిగడ్డ నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జగన్ ను దేవుడని ప్రజలు మొక్కితే.. ఆయన దెయ్యమై ప్రజలను పీడిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని.. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అని చెప్పిన పవన్ కల్యాణ్.. జగన్ చెప్పే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. అసలు జగన్ అద్భుతమైన పాలకుడైతే తాను రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదని చెప్పుకొచ్చారు. యువత భవిష్యత్తు బాగుండాలని తానెప్పుడూ అనుకుంటానని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నానని పవన్ టీడీపీతో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు!