పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయన్నది ఓపెన్ సీక్రకెట్. వేలం పాట నిర్వహించి మరీ ఏకగ్రీవాలు చేసేయడం చాలా పంచాయితీల్లో ఆనవాయితీ. దేవాలయాల అభివృద్ధి, స్కూళ్ళ నిర్మాణం, గ్రంధాలయాల ఏర్పాటు.. ఇలాంటివన్నీ ‘వేలం పాట’ సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు. ఇవి కాక, గంపగుత్తగా ఓట్లను కొనేయడం అనేది ఇంకో పద్ధతి. వీటిల్లో చాలావరకు తెరవెనుక జరిగే వ్యవహారాలే. ఇక, ఇప్పుడు ఏపీ పంచాయితీ ఎన్నికలు షురూ అయిన దరిమిలా, కొన్ని పంచాయితీల్లో ‘వేలం పాట’ సందడి మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ పంచాయితీలో 33 లక్షలకు ‘ఏకగ్రీవం వేలం పాట’ జరిగింది. చిత్తూరు జిల్లాలో ఓ పంచాయితీ 45 లక్షలకు వేలం పాట ఖాయం చేసిందట. మొత్తం 13 జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏకగ్రీవాలంటే, గ్రామాన్ని ఫలానా వ్యక్తి సర్పంచ్ అయితే బాగా అభివృద్ధి చేస్తారని అక్కడి ప్రజానీకం నమ్మి గెలిపించడం. కానీ, ఇక్కడ పరిస్థతి వేరు. ప్రభుత్వం ఏకగ్రీవాల కోసం నజరానా ప్రకటించడం అనేది చాలా ఏళ్ళుగా జరుగుతోంది.
తీరా, ఏకగ్రీవాలయ్యాక.. ఆయా గ్రామాలకు ఇస్తామన్న నజరానా ప్రభుత్వం నుంచి అందడంలేదన్న విమర్శలూ లేకపోలేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాల సంగతి పక్కన పెడితే, గ్రామస్తులు వేలం పాట ద్వారా నిర్వహించే ఏకగ్రీవాలకు మాత్రం డబ్బులు క్షణాల్లో చేతులు మారిపోతాయ్. అలా ఎంతోమంది సర్పంచులు చేతులు కాల్చుకున్న వైనం కూడా కళ్ళ ముందే కదలాడుతోంది. సర్పంచులకు మన వ్యవస్థలో ఎంతటి గౌరవం వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి, పెద్దగా గౌరవం లేని (రాజకీయంగా) సర్పంచ్ పదవి కోసం ఎందుకు ఇంతలా ఖర్చు చేస్తారు.? అన్న ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు వినిపిస్తాయి. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులు తమ సొంత ఇలాకాలో పట్టు కోసం ఇలాంటి వేలంపాట ఏకగ్రీవాలకు తెరలేపుతుంటారు. విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిథులదీ అదే తీరు.. అయితే, అధికార పార్టీని ఇలాంటి విషయాల్లో డీ కొట్టడం విపక్షాలకు అంత తేలిక కాదు. మొత్తమ్మీద, ఏకగ్రీవాలపై ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామని చెబుతున్న ఎస్ఈసీ, ఇప్పటికే జరుగుతున్న ఏకగ్రీవాలపై ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే.