Robinhood: ఈ వారం తెలుగు బాక్సాఫీస్ దగ్గర అసలు హంగామా మొదలుకానుంది. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, ఎంపురాన్ (L2E) లాంటి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో థియేటర్‌ల కోసం పోటీ పెరిగింది. ముఖ్యంగా నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం నైజాంలో థియేటర్లు దొరకడం కాస్త కష్టంగా మారిందని సమాచారం.
హైదరాబాద్ వంటి కీలక మార్కెట్లో మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో మైత్రి మూవీ మేకర్స్‌కి షోలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మలయాళ బిగ్ మూవీ ఎంపురాన్, మరోవైపు సితార సంస్థ నుండి మ్యాడ్ స్క్వేర్ కూడా అదే రోజున రాబోతుండటంతో థియేటర్‌ల షేరింగ్‌పై ప్రెషర్ కనిపిస్తోంది. నితిన్‌కు ఈ ఏరియాలో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు కాస్త గందరగోళంగా మారాయి.
ఇండస్ట్రీలో చర్చించబడుతోన్న అంశం ఏమిటంటే, ఇలాంటి బిజీ వీకెండ్‌లో పెద్ద సంస్థ అయిన మైత్రికి కూడా స్పేస్ దొరకకపోవడం ఆశ్చర్యమే. గతంలో భారీ సినిమాలను అందించిన మైత్రి ఈసారి ఇబ్బందుల్లో పడడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ రోజు మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో చర్చలు జరిపి షోలు బలోపేతం చేయాలని మైత్రి ప్లాన్ చేస్తోందని సమాచారం.
రాబిన్ హుడ్‌కు మంచి ఓపెనింగ్స్ రావాలంటే థియేటర్ కవరేజ్ కీలకం. ఇప్పటికే సాంగ్స్, ప్రచారంతో బజ్‌ను పెంచిన చిత్ర యూనిట్ థియేటర్ సమస్యను క్లియర్ చేసుకుంటే, తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద హిట్ శబ్దం వినిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.