తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ మరోసారి వార్తల్లోకి వచ్చాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ఆర్థికంగా దోచుకుంటున్న ఈ యాప్స్‌పై పెద్ద ఎత్తున నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ మాఫియాను నిర్మూలించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధితుల ఆత్మహత్యలు, అప్పుల ఊబి, కుటుంబాల ఆందోళనలు.. ఇవన్నీ ప్రభుత్వానికి సీరియస్ హెచ్చరికలుగా మారాయి.
ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రముఖ యూట్యూబర్లు, సినీ నటులు, సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రమోటర్లను పోలీసులు గుర్తించగా, 25 మందికి పైగా సెలబ్రిటీలను విచారణకు పిలిచారు. కొంతమంది విదేశాలకు పారిపోయినట్టుగా పోలీసులు ప్రకటించడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇది ఎంతటి విస్తృతంగా వ్యాపించిందో తెలియజేస్తోంది.
సిట్ విచారణ పరిధిలో యాప్స్ వెనుక ఉన్న అసలు మేథావులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, పబ్లిసిటీ ఇచ్చిన సెలబ్రిటీల బాధ్యతలు అన్నీ వస్తాయి. ముఖ్యంగా గూగుల్ వంటి సంస్థలతో కమ్యూనికేషన్ పెంచి యాప్స్‌ను ప్లాట్‌ఫామ్‌ల నుంచే తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఇకపై ఏ సెలబ్రిటీ అయినా బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ చేస్తే, వారు చట్టపరమైన చర్యలకు లోనవుతారని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు, యువత, పెద్దలంతా అభినందనలు తెలియజేస్తున్నారు. ఫైనాన్స్ యాప్స్, గేమింగ్ యాప్స్ ముసుగులో జరిగిన మోసాలకు అంతం పలకాలంటే, ఈ దర్యాప్తు నిజంగా బలంగా ఉండాలనే ఆశ నలుదిశల నుంచీ వ్యక్తమవుతోంది.