ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం ముగించిన పవన్… నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటరయ్యారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మైకందుకున్న పవన్… సినిమా స్టార్స్ ఫ్యాన్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వాటికి రియాక్షన్ అన్నట్లుగా ఒక ఫోటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!
అవును… మహేష్ బాబు, ప్రభాస్ లు తన కంటే పెద్ద స్టార్స్ అని.. వారు తన కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని మొదలుపెట్టిన పవన్ … ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబుల అభిమానులు జనసేనకు మద్దతుగా నిలవాలని కోరిన సంగతి తెలిసిందే. జనసేనకు సినిమా హీరోల అభిమానులు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపుకు స్టార్ హీరోల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.. ఫ్యాన్స్ కూడా స్పందించినట్లు కనిపించలేదు.
దీంతో ఇలా సైలంటుగా ఉంటే ఎలా అనుకున్నారో.. లేక, నిజంగానే మహేష్ బాబు అభిమానులు కొంతమంది స్పందించారో తెలియదు కానీ… తాజాగా వారాహి యాత్ర ర్యాలీలో “నేను మహేష్ బాబు అభిమానిని” అని ఫ్లకార్డు పట్టుకుని కనిపించాడు ఒక యువకుడు. ఆ ఫ్లకార్డుపై “నేను మహేష్ బాబు అభిమానిని కానీ… ఓటు మాత్రం జనసేనకే” అని ఉంది.
దీంతో ఈ పిక్ ఆన్ లైన్ లో వైరల్ చేసే పనిలో జనసైనికులు ఉన్నారని తెలుస్తుంది. మహేష్ బాబు అభిమానులు తమకు మద్దతు తెలుపుతున్నారనే విషయాన్ని పీక్స్ లో ప్రచారం చేయాలని ఫిక్సయ్యారట. అయితే ఈ ఫోటోపై భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు నెటిజన్లు.
వీళ్లు నిజంగా మహేష్ బాబు అభిమానులేనా.. అలా అయితే తమ అభిమాన హీరో పిలుపునివ్వకముందే ఈ తుత్తర ఏమిటి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమందైతే… వీళ్లు నిజంగా మహేష్ బాబు అభిమానులేనా… లేక, జనసైనికులు ఇలా కొత్త అవతారం ఎత్తి పార్టీకి కొత్తరకం ప్రచారం చేసుకుంటున్నారా అని అనుమానిస్తూ, ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఏది ఏమైనా… ఈ ఫోటో మాత్రం కొత్తరకం చర్చకు తెరలేపింది. మరి ఈ ఫోటో కాసేపు నిజమే అనుకుంటే … ఈట్రెండ్ ని మిగిలిన హీరోల అభిమానులు కూడా ఫాలో అవుతారా.. లేక, వీళ్లు నలుగురితోనే ఆగిపోతుందా అనేది వేచి చూడాలి.