Reventh Reddy: తెలంగాణ సీఎంను కలవబోతున్న టాలీవుడ్ ప్రముఖులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు అంశంపై చేసిన ప్రకటన టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ప్రకటన సినిమా పరిశ్రమపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, వచ్చే సంక్రాంతి విడుదలలైన భారీ సినిమాలు అయిన ‘గేమ్ ఛేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలకు ఈ నిర్ణయం చిక్కులు సృష్టించవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి సిద్ధమవుతున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే, టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల టీమ్ సీఎం వద్దకు వెళ్లే అవకాశం ఉందని నాగవంశీ హింట్ ఇచ్చారు. ఈ భేటీ సందర్భంగా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సమస్యలపై తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాకు మహారాజ్’ సినిమా నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ ధరల వ్యవహారం, బెనిఫిట్ షోల నిషేధం వంటి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడం అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశాలు పరిశ్రమకు ఎదురయ్యే సవాళ్లను మరింత క్లిష్టతరం చేస్తాయని, ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు ప్రభావం చూపవచ్చని అన్నారు.

టాలీవుడ్ పరిశ్రమ బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ద్వారా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకునే పద్ధతిని అనుసరిస్తోంది. అయితే, సీఎం తీసుకున్న తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ మోడల్ కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖుల ప్రయత్నాలు సమస్యల పరిష్కారానికి ఎంతవరకు దోహదపడతాయో చూడాలి.