సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీలో అభ్యర్థుల ఎంపిక ఆసక్తిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని.. గెలిచి నిలవాలని చంద్రబాబు బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. ఇప్పటికే “రా.. కదలిరా” సభలను విజయవంతంగా కండక్ట్ చేస్తున్నారు. మరోపక్క “శంఖారావం” పేరుతో చినబాబు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెడనలో అభ్యర్థి ఎంపిక సంక్షిష్టంగా మారిందని అంటున్నారు.
అవును… ఈసారీ ప్రతీ ఓటు, ప్రతీ సీటూ అత్యంత కీలకం అనేది తెలిసిన విషయమే. అందుకే అటు జగన్ అయినా, ఇటు చంద్రబాబు అయినా అభ్యర్థుల ఎంపికలో ఏ చిన్న విషయంలోనూ రిస్క్ తీసుకోకుండా మ్యాగ్జిమం సేఫ్ గేం ఆడటానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఎంత సేఫ్ గా ప్లాన్ చేసుకున్నా.. కొన్ని నియోజకవర్గాలు మాత్రం అత్యంత క్లిష్టంగా మారుతున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పెడన సీటు చంద్రబాబుకు పెద్ద పీటముడిగా మారుతోందని అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా కాపు, గౌడ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో… సాధారణంగా ఈ రెండు సామాజికవర్గాల నుంచి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంటుంది. అయితే… ఈసారి రెండు సామాజికవర్గాల నుంచీ ఇద్దరు అభ్యర్థులు టిక్కెట్ కోసం టీడీపీలో పోటీ పడుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే… పెడన నుంచి ప్రస్తుతం వైసీపీ తరఫున జోగి రమేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగన్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి జోగి రమేశ్ ను జగన్ పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు. కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాము వచ్చే ఎన్నికల్లో పెడన అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఇక్కడ జోగి రమేష్ కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాగా.. రాము ఉప్పాల, గౌడ సామాజికవర్గానికి చెందిన నేత! ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో పెడనలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకున్న బాబు… ఈసారి టిక్కెట్ కాపు సామాజికవర్గానికి ఇవ్వాలా, గౌడ సామాజికవర్గానికి కేటాయించాలా అనే విషయంలో తీవ్ర సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తుంది.
కారణం… ప్రస్తుతం పెడన నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాగిత వెంకట్రావు కుమారుడైన కృష్ణప్రసాద్. ఈయన గౌడ సామాజికవర్గానికి చెందిన నేత! దీంతో… ఈసారి ఈయనకే టిక్కెట్ ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. మరోపక్క పెడన సీటును మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా ఆశిస్తున్నారు. ఈయన కాపు సామాజికవర్గానికి చెందినవారు.
పెడనలో కాపు సామాజికవర్గ ఓట్లు సుమారు 40 వేలవరకూ ఉండగా.. గౌడ సమాజికవర్గ ఓట్లు 35వేలకు పైగా ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… వీరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి అనే విషయంలో చంద్రబాబు తలపట్టుకున్నారని చెబుతున్నారు. మరి ఫైనల్ గా బాబు నిర్ణయం ఎలా ఉంటుందని ఇప్పుడు ఆసక్తిగా మారింది!!