జడ్జీలు సందేహాలకు అతీతులా?

it is not wrong to express suspicions about judges
“అయోనిజపైనే అనుమానమా? ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ విషమ పరీక్షా?” అంటూ లవకుశ సినిమాలో సీతమ్మ ఆక్రోశించినట్లు “జడ్జీలపైనే అనుమానాలా”  ఒక హైకోర్టు న్యాయమూర్తి ఆక్రోశాన్ని వెలిబుచ్చినట్లు పచ్చమీడియా ఒక వార్తను మొదటిపేజీలో ప్రచురించింది.  నిజమే…న్యాయమూర్తులు అంటే సాక్షాత్తూ దైవదూతలు.  వారు మానవమాత్రులు కారు.  అందుకని వారిని అనుమానించరాదు మరి!  జడ్జీలనే అనుమానిస్తారా అని వాపోయేముందు అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి  అని కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి.   
 
it is not wrong to express suspicions about judges
 
దేశంలో ఇంతవరకు ఏ సుప్రీమ్ కోర్ట్ లేదా హైకోర్టు న్యాయమూర్తి కూడా ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి వేదికలను పంచుకోవడం, వారితో కలిసి విందులు చెయ్యడం మనం ఇంతవరకూ చూడలేదు.  కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అనేక నేరాల్లో స్టేలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి రహస్యంగా పున్నమిఘాట్ లో విందులు ఇస్తే, దానికి హైకోర్టు, సుప్రీమ్ కోర్టు నుంచి ఏకంగా పదహారు మంది జడ్జీలు హాజరు కావడం, ఆ విందులో ఐఏఎస్ అధికారులను కూడా బయటకు పంపించి చంద్రబాబు ఒక్కరే వారితో సమావేశం కావడం చూసాక జడ్జీల మీద అనుమానాలు రాకుండా ఎలా ఉంటుంది?  
 
ఒక నేరంలో నిందితుడు తన నేరాన్ని బహిర్గతపరచవద్దు అని కోర్టుకు వెళ్తే ప్రభుత్వాన్ని, పోలీసులను ఏమాత్రం సంప్రదించకుండా నిముషాల మీద అతని కోరికను తీర్చడమే కాక, అడగని ఇతర నిందితులకు కూడా వరాలు ఇచ్చే  న్యాయమూర్తులు ఉన్నప్పుడు అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి?
 
ఒక వైద్యుడు సరైన అనుమతులు లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తూ, అందులో అగ్నిప్రమాదం జరిగి పదిమంది అమాయకులు పరలోకానికి ప్రయాణం అయినపుడు ఆ నేరగాడిని అసలు పట్టుకోవద్దు, అరెస్ట్ చెయ్యవద్దు…. అని హుకుంలు జారీచేసే న్యాయమూర్తులు ఉన్నప్పుడు అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి?  
 
సోషల్ మీడియాలో ఎవరో ఏదో రాసుకుంటుంటే, వారివలన తమ పరువుకు భంగం కలుగుతున్నదని ఆగ్రహించి..ఒక పోలీసు కానిస్టేబుల్ చెయ్యాల్సిన దర్యాప్తును ఏకంగా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే న్యాయమూర్తులు ఉన్నప్పుడు అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి? 
 
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎన్నికల కమీషనర్ ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించే నిమిత్తమై స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేసినపుడు ఆ చర్య తప్పు అని చెప్పలేని న్యాయమూర్తులు ఉన్నప్పుడు అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి? 
 
అయిదు కోట్లమందికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్లకు వారి వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించే, బెదిరించే న్యాయమూర్తులు ఉన్నప్పుడు అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి?  
 
ఇలా వ్రాయదలచుకుంటే ధృతరాష్ట్ర సంతానమంత సంఖ్యలో ఆరోపణలు దొరుకుతాయి. మనం నిజాయితీగా, ఆత్మసాక్షిగా పనిచేస్తే మనను ఎవ్వరూ అనుమానించరు. మన ప్రవర్తన ఇతరులు వేలెత్తి చూపించే విధంగా ఉన్నప్పుడు ఎవరినైనా లోకం శంకిస్తుంది.  సీతమ్మ  నిప్పు లాంటిది అని తెలిసీ కూడా శ్రీరాముడు అనుమానించలేదా?  ఆమె తన పవిత్రతను నిరూపించుకున్న తరువాత తిరిగి అర్ధసింహాసనం ఇవ్వలేదా?  సందేహాలకు, అనుమానాలకు ఎవ్వరూ అతీతులు కారు.  మనం పులుగడిగిన ముత్యాలం అనుకుంటే సరిపోదు.  ప్రపంచం కూడా అలా భావించినపుడే మన గౌరవమర్యాదలు నిలబడతాయి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు