ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారత క్రికెట్ చరిత్రలో మరో మహత్తరమైన అధ్యాయం ప్రారంభం కానుంది. 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే స్పోర్ట్స్ సిటీ భాగంగా ఈ మెగా స్టేడియం నిర్మించనున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (132,000 సీట్లు) మొదటి స్థానంలో ఉండగా, అదే స్థాయిలో అమరావతి కూడా అడుగులు వేయనుంది.
ఈ భారీ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇచ్చారు. ఆటగాళ్లకు అత్యాధునిక సదుపాయాలతో పాటు ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో స్టేడియానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రవాణా, పార్కింగ్, హోటళ్లు, ఇతర మౌలిక వసతులు కూడా స్టేడియం చుట్టూ అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపిన వివరాల ప్రకారం, ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రాజెక్టును అంగీకరించారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లకు అమరావతి వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే, విశాఖ, మంగళగిరి, కడప, విజయవాడ, విజయనగరం సహా ఇతర ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు వేగంగా సాగుతున్నాయి. అమరావతిలో క్రికెట్‌కు ఈ స్థాయిలో ప్రాధాన్యం రావడం రాష్ట్ర యువతకు గొప్ప ప్రోత్సాహంగా మారనుంది.