ఏమాటకామాట చెప్పుకోవాలంటే పాముకి రెండు నాలుకలు ఉంటాయి అని అంటారు.. దాని కోరల్లో విషయం నిండి ఉంటుందని చెబుతారు.. అది కాటు వేస్తే ఎంత మంచి వ్యక్తి అయినా చనిపోయే ప్రమాదం ఉందని అంటుంటారు! అంటే… పాము కాటు వేస్తే అది అవతలి వ్యక్తి మంచి వ్యక్తా, కాదా అనే తారతమ్యాలు ఏమీ లేకుండా ప్రమాదం అన్నమాట!
అది పాము కాబట్టి, మన్ను తిని బ్రతుకుందని అంటారు కాబట్టి, పొట్టతో పాకుతుంది కాబట్టి.. అది భయపడో, కోప్పడో అవతలి వారిపై విషం చిమ్మిందంటే అర్ధం ఉంది! మరి ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్ గా చెప్పుకునే మీడియా కూడా ఇలా రెండు నాలుకలతో ఎందుకు వ్యవహరిస్తోంది? తప్పు ఎక్కడ జరిగినా తప్పే.. ఒప్పు ఎవరు చేసినా ఒప్పే.. ఈ ఇంగితం మరిచి ఎందుకు మన్ను తింటుంది?
ప్రస్తుతం సామాన్యుడి సందేహాలు ఈ విధంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఆ సందేహాల సంగతి కాసేపు పక్కనపెట్టి పాయింట్లోకి వెళ్తే… ప్రస్తుతం తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్ లో “హైడ్రా” వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెషన్ ను కూల్చివేసిన అనంతరం హైడ్రా వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యింది.
ఈ వ్యవహారంపై మీడియా కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతుందని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు ఎవైనా, ఎవరివైనా, ఎక్కడున్నా కూల్చివేయాలంటూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది! ఈ పనిని రేవంత్ హీరోయిజంగానూ పలువురు అభివర్ణిస్తున్న పరిస్థితి. అంతవరకూ బాగానే ఉంది!
ఆ సంగతి అలా ఉంచి… ఇదే పనిని ఏపీలో అమలుచేస్తే! చేస్తే ఏమిటి.. ఒకానొక సమయంలో జగన్ ఈ పనికే పూనుకున్నారు! కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల చంద్రబాబు నాయుడి ఇల్లు వరద కట్ట లోపల ఉన్నది! అది చంద్రబాబుదా, ప్రభుత్వానిదా , లింగమనేనిదా అనే సంగతి కాసేపు పక్కనపెట్టి దీనిపై జగన్ చర్యలకు ఉపక్రమిస్తే… కచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు అన్నట్లుగానే మీడియా చిలువలు పలువలు చేసిన పరిస్థితి!
ఇదే క్రమంలో అయ్యన్నపాత్రుడి ఇంటి మొత్తాన్ని కూల్చలేదు జగన్ సర్కార్.. రెండు అడుగులకు సంబంధించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కూల్చారు! అయితే… వాటిని కూడా నాడు కక్ష సాధింపు చర్యలు అంటూ మీడియా ప్రధాన హెడ్డింగులు పెట్టింది.. బ్యానర్ ఐటమ్స్ వేసింది! స్పెషల్ డిబేట్స్ కండక్ట్ చేసింది! ఇదే పని ఇప్పుడు రేవంత్ చేస్తుంటే… వీరుడూ, శూరుడూ అంటూ లేపుతుంది!!
దీంతో… ఇలాంటి అవకాశవాద ప్రచార బాధ్యతలు.. ప్రింటింగ్ ప్రెస్ లో పాంప్లెట్లు వేసి పంచడానికీ జర్నలిజం అనే పవిత్రమైన పదాన్ని వాడుకుంటున్నారని.. ఆ ముసుగులో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.