ఇలాగైతే మూడు రాజధానులు మూలపడినట్టే 

Kurnool
 
Kurnoolరాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు ఎంత తొందర పడుతోందో ఆ కార్యక్రమం అంత వెనక్కి పోతోంది.  పెద్ద కష్టం లేకుండానే శాసనసభలో, గవర్నర్ వద్ద బిల్లుకు ఆమోదం తెచ్చుకోగలిగిన ప్రభుత్వం న్యాయస్థానం ముందు నెమ్మదించక తప్పలేదు.  ప్రభుత్వం చకచకా శాసన ప్రక్రియను పూర్తి చేయడం చూశాక ఇక అమరావతి అంకం  మునుగిసినట్టేనని అనుకున్నారు అందరూ.  రాజధాని రైతులైతే గవర్నర్ సంతకం చేసి ఆమోద ముద్ర వేయడం, కేంద్రం రాజధానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం వంటి పరిణామాలతో పూర్తిగా నమ్మకం కోల్పోయారు.  ఇన్ని నెలల తమ పోరాటం వృథా అయినట్టేనని కన్నీరు పెట్టుకున్నారు.  కానీ అనూహ్యంగా హైకోర్టులో ప్రభుత్వానికి బ్రేకులు పడటంతో వారిలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. 
 
 
మూడు రాజధానులు అనేది విభజన చట్టానికి విరుద్దంగా ఉందని వివిధ కారణాలు చూపుటూ 55 పిటిషన్లు పడ్డాయి.  వాటి మీద విచారణ చేపట్టిన ధర్మాసనం బిల్లు అమలుపై స్టేటస్ కో ఈ నెల 14 వరకు విధించిన సంగతి తెలిసిందే.  ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ప్రభుత్వం కౌంటర్లో వినిపించాల్సిన బలమైన వాదన మీద దృష్టి పెట్టకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను నిలిపివేయాలని పిటిషన్ వేసింది.  అలాగే హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది.  ఈ రెండింటిలో ఏది విజయం సాధించినా.. అంటే సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో మీద స్టే ఇచ్చినా, హైకోర్టులో తమ వాదనలు ఫలించి స్టేటస్ కో ఎత్తివేసినా ఈ నెల 16న విశాఖలో తలపెట్టిన శంఖుస్థాపన కార్యక్రమాన్ని జరపవచ్చని భావించింది. 
 
 
కానీ అనూహ్యంగా ఆ రెండూ ఫలించలేదు.  సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రాకపోగా హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు ప్రభావం చూపలేదు.  ఫలితంగా స్టేటస్ కోను ఈ నెల 27వరకు యథాతథంగా కొనసాగించాలని ధర్మాసనం ఉత్తర్వులిస్తూ కేసును వాయిదా వేసింది.  దీంతో 16న శంఖుస్థాపన చేయాలన్న, ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలన్న జగన్ ఆశలు ఆవిరైపోయాయి.  ఈ స్టేటస్ కో ఉత్తర్వుల ద్వారా మూడు రాజధానుల బిల్లుకు ఎలాంటి ప్రమాదం లేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకి ఏర్పడటం గమ్మత్తైన విషయం.  ఎందుకంటే బిల్లులను చట్టాలుగా చేయడమనేది శాసన ప్రక్రియ.  అందులో కోర్టులు ఎప్పుడూ కలుగజేసుకోవు.  ఆ బిల్లులు చట్టాలుగా మారాక అవి రాజ్యాంగబద్దంగా ఉన్నాయో లేదో అనేది మాత్రమే చూస్తుంది.  ఇప్పుడు జరిగేది అదే.  
 
 
కొందరు బిల్లులు రాజ్యాంగవిరుద్దంగా ఉన్నాయని పిటిషన్ వేయడంతో విచారణ కోసం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.  ఇవి కూడా ఎందుకంటే ఒకవేళ రేపటి రోజున మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదని, బిల్లు రాజ్యాంగవిరుద్దంగా ఉందని కోర్టు భావిస్తే దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది.  ఈలోపు ప్రభుత్వం విశాఖలో పాలనాపరమైన భవనాకు, కర్నూలులో హైకోర్టును నిర్మిస్తే బోలెడంత ప్రజాధనం వృథా అవుతుంది.  అందుకే తీర్పు వచ్చే వరకు పాత వాటిని తొలగించడం, కొత్త భవనాలు కట్టడం చేయకూడదని ఆదేశించింది.  మరి ఈ స్టేటస్ కో ఎప్పుడు తొలగుతుంది అంటే పలానా రోజని ఖచ్చితంగా చెప్పలేం.  ఎందుకంటే ప్రభుత్వం వాదనలు పిటిషనర్ల వాదనల కంటే బలంగా ఉండాలి.  అంతా రాజ్యాంగబద్దంగానే జరుగుతోందని న్యాయస్థానం నమ్మాలి.  అది జరగడం ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. 
 
 
ఒకవేళ అంతా బాగానే ఉన్నా కేసు వాయిదా పడకుండా ఉండటం చాలా ముఖ్యం.  ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది కనుక ఇంకొన్నిసార్లు కూడా పడే అవకాశం ఉందని, ఇప్పుడప్పుడే తుది తీర్పు వెలువడదని, ఒకవేళ అంతిమ తీర్పు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వచ్చినా ఆలస్యం మాత్రం ఖాయమనేది నిపుణుల అభిప్రాయం.  ఎందుకంటే ఈ బిల్లు రాష్ట్రానికి సంబంధించిన చాలా కీలకమైన బిల్లు.  భవిష్యత్తులో కేస్ స్టడీగా నిలిచే అవకాశం ఉన్న కేసు.  అందుకే కట్టె కొట్టె తెచ్చె అనే రీతిలో విచారణన జరగదు.  ఇరువైపుల వాదనలను పరిపూర్ణంగా విని, చాలా ఖచ్చితత్వంతో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది.  అందుకే ధర్మాసనం విచారణకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందట.  ఈ పరిణామాన్ని ముందుగా పసిగట్టే దసరాను కొత్త ముహుర్తంగా ప్రభుత్వం నిర్ణయించిందని అనుకుంటున్నారు.  ఇలాగే కేసు వాయిదాలు పడుతూ పోతే మూడు రాజధానులు మూలపడ్డట్టేనని కూడ అనుకుంటున్నారు.