వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో అన్నదాతల కోసం చేసిన ఒక్క మంచి పని కూడా లేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.
అన్నదాత సుఖీభవ నిధులపై స్పష్టత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని ఎంపీ కలిశెట్టి స్పష్టం చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ.14,000 రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. త్వరలోనే మూడో విడత కింద రూ.6,000 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఏడాదికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అన్నదాతలకు అందిస్తున్నామని గుర్తుచేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి బాధితులకు అండగా నిలిచారని, అందుకే రైతాంగం ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతుగా ఉందని పేర్కొన్నారు.

కోర్టు హాజరు పైనా రాజకీయం నాంపల్లి కోర్టుకు జగన్ హాజరు కావడాన్ని కూడా వైసీపీ ఒక రాజకీయ ర్యాలీగా మార్చిందని ఎంపీ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత కేసుల విచారణను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం జగన్ తీరుకు నిదర్శనమని మండిపడ్డారు.
పెట్టుబడుల వెల్లువ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఎంపీ వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్ ద్వారా రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల సమష్టి కృషితో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు.

