పాకిస్తాన్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియా సహా పలు వర్గాల్లో పెను పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఆయన జైలులో తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ ప్రత్యక్షంగా జైల్లో కలసి వచ్చిన సమాచారం అభిమానులకు ఊరటనిచ్చింది.
ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు.. ఆయన బతికే ఉన్నారు అంటూ ఉజ్మా చేసిన ప్రకటనతో ఉద్రిక్తత ఒక్కసారిగా తగ్గింది. అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసిన తర్వాత ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగిన ‘ఇమ్రాన్ ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది’ అన్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.
అయితే మరోవైపు, జైలులో ఆయనపై మానసిక ఒత్తిడి తెస్తున్నారంటూ ఉజ్మా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇమ్రాన్‌ను చూడటానికి కుటుంబ సభ్యులను మొదట అనుమతించకపోవడం, స్పష్టమైన వైద్య సమాచారం బయటకు రాకపోవడమే ఈ అనుమానాలకు కారణమైంది. ఇదే సమయంలో ఇస్లామాబాద్‌తో పాటు పాక్‌లోని పలు నగరాల్లో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇమ్రాన్‌ను చూపించాలి.. నిజం బయటకు రావాలి అంటూ నినాదాలు చేశారు.
ఈ ఆందోళనల తీవ్రత పెరిగిన తర్వాతే జైలు అధికారులు ఉజ్మా ఖానుమ్‌తో పాటు ఒక న్యాయవాదికి ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఆమె జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన సేఫ్‌గానే ఉన్నారు అని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త ఊరట కనిపించింది. అయినప్పటికీ, ఆయన ఆరోగ్యంపై పూర్తి స్థాయి వైద్య నివేదికను బహిర్గతం చేయాలని మద్దతుదారులు పట్టుబడుతున్నారు.
ఇమ్రాన్ కుటుంబం గత నెల చివరి నుంచే అలర్ట్‌లో ఉంది. ఆయన ముగ్గురు సోదరీమణులు కలవడానికి వెళ్లినప్పుడు తమపై దాడి జరిగిందని చేసిన ఆరోపణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుమారులు కూడా తమ తండ్రి ఆరోగ్యం గురించి అధికారులు ఏదో దాస్తున్నారని వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది.
అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి ఆందోళన కరంగామారాయి. ఆయన సురక్షితంగా ఉన్నట్టు సోదరి ప్రకటించడం ఒకవైపు ఊరట కలిగించినా.. అసలు జైలులో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ప్రశ్నలు మాత్రం ఇంకా అనేక మందిని వెంటాడుతున్నాయి.
