నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఉద్భవించిన ‘దిత్వా’ తుఫాన్ క్రమంగా బలపడుతూ ఉత్తర–వాయువ్య దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి నాలుగు వందల కిలోమీటర్లకు పైగా, చెన్నైకు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వేగం పెద్దగా లేకపోయినా, నిరంతర కదలికతో ఈ తుఫాన్ త్వరలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలను ప్రభావితం చేయనుందని అంచనా వేయడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ తుఫాన్ ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షపాతం భారీగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు ఇంటి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఆదివారం నాటికి పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని, కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
తుఫాన్ ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల దగ్గర నిలబడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 ద్వారా సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. అవసరమైతే పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. తుఫాన్ దిశ, తీవ్రతను గంటగంటకు సమీక్షిస్తూ ప్రజలకు తాజా సమాచారాన్ని అందిస్తామని వాతావరణ శాఖ వెల్లడించింది.
