AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్‌లో అవకతవకలు: అందరికి స్ట్రోక్ ఇచ్చారుగా..

ఏపీ ఫైబర్ నెట్‌లో ఇటీవల తీసుకున్న ప్రక్షాళన చర్యలతో రాజకీయం వేడెక్కుతోంది. సంస్థలో గతంలో నియమించిన 410 మందిని తొలగిస్తున్నట్లు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. ఈ ఉద్యోగుల్లో చాలామందికి అవసరమైన అర్హతలు లేవని, అలాగే నియామక ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలు ఏవీ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, వైసీపీ ప్రభుత్వం హయాంలో పలువురు నేతల సూచనలతో ఈ ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరంగా, ఈ ఉద్యోగులను నాటి నేతలు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. వారి ఇళ్లలో పనిమనుషులుగా, కారు డ్రైవర్లుగా పనిచేయించిన ఈ ఉద్యోగులకు ఫైబర్ నెట్ నుంచే వేతనాలు చెల్లించారట. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన ఆరోపణలు కొత్త చర్చకు దారితీశాయి. ఫైబర్ నెట్ నుంచి వర్మకు చట్ట విరుద్ధంగా రూ.1.5 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని కోరారు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని జీవీ రెడ్డి హెచ్చరించారు. ఈ పరిణామాలు ఫైబర్ నెట్‌కు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంస్థ ప్రక్షాళన ప్రక్రియలో ఉద్యోగ నియామకాలను మళ్లీ పరిశీలించి, అవసరాలను బట్టి కొత్త నియామకాలు చేపడతామని జీవీ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్‌లో క్రమశిక్షణను స్థాపించడమే తమ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.