Revanth Reddy: అందుకే ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నాం: సీఎం రేవంత్

హైద‌రాబాద్‌లో సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రేవ‌తి అనే మ‌హిళ దుర్మరణం చెందడం తీవ్ర దురదృష్టకరమని పేర్కొన్న ఆయన, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో, ఈ ఘటన తాలూకు వీడియోను అధికారులు ప్లే చేశారు. ఈ దృశ్యాలు చూసిన ముఖ్యమంత్రి, థియేటర్ యాజమాన్యం మరియు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించే హీరోలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సినిమా కోసం ప్రాణాలు కోల్పోవడం ఎంతగానో బాధకరమని పేర్కొన్న రేవంత్, సామాజిక బాధ్యతపై సినీ ప్రముఖులకు పలు సూచనలు చేశారు.

తెలంగాణలో ప్రజల శాంతి భద్రతలే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. “సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రేక్షకులపై ప్రభావం చూపే సాధనం. ఒక హీరో నిజ జీవితంలోనూ హీరోలా ఉండాలి,” అని ఆయన సూచించారు. సంఘటన తర్వాత బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మరోసారి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు లేదా టికెట్ ధరల పెంపుకు అవకాశం లేకుండా కఠిన నియంత్రణలు ఉంటాయని సీఎం ప్రకటించారు. థియేటర్ యాజమాన్యాలు, సినీ పరిశ్రమ ఈ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అవసరమైనవి అని తెలిపారు. “ఇలాంటి ఘటనల నివారణ కోసం, సరైన విధానాలతో ముందుకు సాగతాం,” అని సీఎం రేవంత్ తెలిపారు.