ప్రముఖ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ మృతి.. మలయాళ సాహిత్యానికి బ్లాక్ డే!

మలయాళం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ రచయిత డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ 91 సంవత్సరాల వయసులో బుధవారం రాత్రి చనిపోయారు. వయసు పైబడటం వలన వచ్చిన సమస్యలతో కోజికోడ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన మృతి చెందారు. పాలక్కాడ్ సమీపంలోని కడలూరు ఆయన సొంత ఊరు. ఈయన బాల్యం నుంచే మలయాళ సాహిత్యం పై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన కథలు, బాలసాహిత్యం, వ్యాసాలు, నవలలు, మలయాళ సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందాయి.

ఉపాధ్యాయుడిగా కెరియర్ ని మొదలుపెట్టిన వాసుదేవన్ తరువాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 54 సినిమాలకి స్క్రీన్ ప్లే అందించారు. ఏడు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వ వహించిన నిర్మాల్యం, కడవు సినిమాలకి ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు దక్కాయి. ఇప్పటివరకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 1996లో జ్ఞాన పీఠ అవార్డు, 2005 లో పద్మభూషణ్ అవార్డు, 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు.

ఈ సంవత్సరం ఓటీటీ లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన మనోరధంగల్ వెబ్ సిరీస్ వాసుదేవన్ రాసిన తొమ్మిది కథల ఆధారంగా తెరకెక్కినదే. ఈయనపై గౌరవంతో ఈ సీరీస్ ని కమల్ హాసన్ సమర్పించగా మోహన్లాల్, మమ్ముట్టి ఫాహద్ ఫాజిల్ లాంటి అగ్రతారలు ఈ సిరీస్ లో నటించారు. ఇక ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ కార్య నిర్వాహక సభ్యుడిగా, కేరళ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఇండియన్ పనోరమ చైర్మన్గా సేవలందించారు.

అంతేకాకుండా మాతృభూమి వారపత్రికకు సంపాదకుడిగా కూడా కొన్ని రోజులు విధులు నిర్వహించారు. ఈయన మృతికి సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ మలయాళ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రగామిగా నిలిపిన ఘనత ఎంటి వాసుదేవన్ నాయక్ మరణంతో మనం కోల్పోయామని అన్నారు. ఆయన మరణం కేరళకు మాత్రమే కాకుండా మలయాళ సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అంటూ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.