ఏపీ రాజకీయాల్లోకి ఒక యువ స్టార్ క్రికెటర్ అడుగుపెట్టబోతున్నాడు. అవును… క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు త్వరలో ఏపీలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయుడు… ఈ సీజన్ ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. తన రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడన్నది ఇంకా స్పష్టం చేయకపోయినా… రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా అని అంటున్నాడు!
అవును.. తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించిన రాయుడు… తనకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని.. అందుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి ప్రవేశించి.. మార్పు తీసుకురావాలనే ఆలోచనే తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించిందని చెబుతున్న రాయుడు… క్రికెట్ నుంచి మాత్రం అప్పుడే రిటైర్ కావడంలేదని అంటున్నాడు!
ఈ విషయాలపై మరింత క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు… “కొన్ని రాజకీయ పార్టీలు నాకు ఫీలర్లు పంపాయి. నేను నా నిర్ణయాన్ని తగిన సమయంలో ప్రకటిస్తాను” అని చెబుతున్నారు. ఇక తన లక్ష్యం ఎంపీ అవ్వడమేనని సూటిగా చెప్పేసిన అంబటి… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా.. లేక, తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే… అంబటి రాయుడికి దూరపు బంధువు అయిన అంబటి రాంబాబు.. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో కీలక నేతగా ఉంటూ, ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు.
కాగా… ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు హైదరాబాద్ లోనే పెరిగాడు. ఐపీఎల్ లో ఎక్కువ కాలం కొనసాగిన క్రికెటర్లలో ఒకరైన రాయుడు.. ఇప్పటికే 190 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడడం గమనార్హం!