సంధ్య థియేటర్ ఘటనలో కోర్టు కేసు ఎదుర్కొని బెయిల్‌పై బయటికి వచ్చిన అల్లు అర్జున్, తన ఇంటి వద్ద టాలీవుడ్ ప్రముఖులతో ప్రత్యేకంగా సమయం గడిపారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు వందలాది మంది ఆయనను కలవడానికి క్యూ కట్టారు. మేకర్స్ నుంచి సీనియర్ నటీనటుల వరకు, అందరూ బన్నీకి మద్దతు తెలిపారు.
ముఖ్యంగా అభిమానులు ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ మధ్య మీటింగ్ ఇవాళ జరిగింది. కుటుంబంతో సహా మధ్యాహ్నం 12 గంటలకు స్వయంగా కారు నడుపుకుంటూ బన్నీ, చిరంజీవి ఇంటికి వెళ్లాడు. చిరు, సురేఖలు అతనికి సాదర స్వాగతం పలికారు. గంటకు పైగా అక్కడ ఉన్న బన్నీ తర్వాత కుటుంబంతో కలిసి వెనుదిరిగాడు. అరెస్ట్ వార్త తెలిసినప్పటి నుంచే చిరంజీవి ఈ వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
ఈ కలయికతో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఆన్‌లైన్ లో కొనసాగుతున్న వివాదాలు తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నంద్యాల పర్యటన సమయంలో తలెత్తిన ఫ్యాన్ వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ములాఖత్, రెండు వర్గాల మధ్య పరిష్కారానికి ఒక చిన్న అడుగు కావచ్చని భావిస్తున్నారు.
పుష్ప 2 భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో జరిగిన ఈ సంఘటన బన్నీకి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కొన్ని సక్సెస్ మీట్లు వాయిదా వేయడం కూడా ఈ కారణంగానే జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బయటకు వచ్చిన నాలుగు వారాల బెయిల్ కారణంగా పుష్ప 2 విజయోత్సవాలకు సంబంధించి మరిన్ని ప్రణాళికలు ముందుకు సాగవచ్చని భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ వర్గాలు మాత్రం బన్నీకి మద్దతుగా నిలిచాయి.