2023 ముగిసింది.. ప్రపంచమంతా 2024లోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సర సంభరాలు ముగిసాయి. రికార్డ్ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు సాగాయి! ఈ సమయంలో 2023 బాగున్నవారంతా… 2024 కూడా బాగుండాలని కోరుకున్నారు. మరికొంతమంది 2024 అయినా బాగుండాలని ఆశపడుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే… 2024 లో పూనకాలు లోడయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. భారతదేశ రాజకీయాల్లో ఈ ఏడాది అత్యంత కీలకం కాబోతుంది!
ప్రధానంగా ఈ ఏడాది మొదటి అర్థభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా… ఐదేళ్ల జగన్ పనితీరు, ప్రతిపక్షాల పోరాటంపై ఏపీ ప్రజానికం ఎలాంటి తీర్పు ఇవ్వబోతోదనేది నిర్ణయించేది ఈ ఏడాదే. ఈ ఏడాది గెలుపోటములు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలక మార్పులకు కారణం కాబోతుంది. వైనాట్ 175 అంటూ ముందుకెళ్తున్న వైఎస్ జగన్… ఆ లక్ష్యాన్ని ఏమేరకు చేరుకుంటారనేది ఆసక్తిగా మారింది.
2023లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయం రసకందాయంలో పడిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు.. ఆ సానుబూతి కూడా తోడైతే జగన్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నట్లు అనిపిస్తున్నా.. లోలోపల మాత్రం భారీ భయాలు ఉన్నాయని అంటున్నారు. కారణం.. చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితానికి 2024 కన్ క్లూజన్ ఇవ్వబోతుందని అంటున్నారు! ఇదే సమయంలో కుప్పం నియోజకవర్గంలో గెలుపు కూడా ఇప్పుడు బాబుకు అత్యంత కీలకం.
ఇక జనసేన ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది కూడా 2024 అనేది విశ్లేషకుల మాట. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో జనసేన సాధించే సీట్లే ఆ పార్టీ మనుగడను వెల్లడించబోతున్నాయి. సీఎం సీఎం అనే నినాదాలకు, జనసైనికుల ఆశలకు ఇప్పటికే పరోక్షంగా చరమగీతం పాడేశారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… పవన్ ను ఈ ఏడాది జనసైనికులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అత్యంత కీలకంగా మారబోతుంది.
ఇదే సమయంలో తెలంగాణలో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి పరిపాలనకు ఈ ఏడాది అత్యంత కఠినమైన పరీక్షా కాలం. ఇదే సమయంలో ఈ ఏడాది తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కూడా జరగనుండటంతో ఈ మూడు నెలల రేవంత్ పరిపాలన ఆ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం అనేది లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది!
మరోపక్క దేశవ్యాప్తంగా అత్యంత కీలమైన ఏడాది కూడా ఇదే కాబోతుంది! ఈ ఏడాది జరబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ & కో భావిస్తున్న నేపథ్యంలో… ఈసారి మోడీని గద్దెదించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకత్వంలోని “ఇండియా” కూటమి బలంగా కంకణం కట్టుకుంది. ఆ రకంగా చూస్తే… ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఈ ఏడాది అత్యంత కీలకం!