యాగం అంటే అదో పెద్ద క్రతువు. పూర్వకాలంలో మన పూర్వీకులు విశేషంగా వీటిని నిర్వహించేవారు. ఇక ప్రస్తుతం ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నవాటిలో చండీయాగం ఒకటి. అయితే అసలు చండీ అంటే ఎవరు ఆ యాగ విశేషాలు తెలుసుకుందాం…
చండీ మాత – చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరిం చేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధి పతులైన చండముండా సురులను కూడా సంహరించింది.
చండీయాగం
మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో. దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీ యాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.
పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువుల పై విజయం సాధించాలనీ. చండీయాగం చేసేవారు.