ఆకాశంలో అరుదైన దృశ్యం కళ్ళముందు నిలవబోతుంది. రాత్రి 9.48 నిమిషాలకు ప్రారంభమయ్యే రాహుగ్రస్త చంద్రగ్రహణం, అర్ధరాత్రి 1.28 నిమిషాల వరకు కొనసాగనుంది. దీని ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడ్డాయి. కానీ భక్తులు ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చుకునే గొప్ప అవకాశం అని పండితులు చెబుతున్నారు. గ్రహణ కాలంలో చేసే జపాలు, పఠనాలు, పూజలు సాధారణ సమయంతో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు పట్టుస్నానం, విడుపు స్నానాలు చేస్తూ ఈ పవిత్ర సమయాన్ని ఆచారపూర్వకంగా గడపడానికి సిద్ధమవుతున్నారు.
పండితుల సూచనల ప్రకారం, చంద్రగ్రహణం తరువాత తెల్లవారు జామున బ్రాహ్మీముహూర్తంలో తప్పనిసరిగా తలస్నానం చేయాలి. గంగాజలాన్ని పొందలేకపోతే, స్నానం నీటిలో పసుపు కలిపి ఆచరించడం శుభప్రదమని చెబుతున్నారు. అనంతరం కొత్త వస్త్రాలు ధరించి దేవుని గదిలోని పసుపు, కుంకుమ, దీపపు చిమ్మలను తొలగించి కొత్త దీపములు వెలిగించాలి. ఇల్లు మొత్తాన్ని శుభ్రపరిచి గంగాజలం లేదా పవిత్ర జలంతో కడగాలి.
ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలను వదిలేయాలి. దర్భలు ఉంచని వంటకాలను తినకూడదు. ఆ తర్వాత దేవుళ్లకు అభిషేకం చేసి, సువాసనగల ధూపాన్ని వెలిగించాలి. పండితులు సూచించిన మరొక ప్రత్యేక ఆచారం ఏమిటంటే—గ్రహణ దోష నివారణ కోసం ఒక పెద్ద పాత్రలో సర్పపాద వెండి ప్రతిబింబం, చంద్రుడి ప్రతిబింబం, కిలోన్నర బియ్యం, మినుములు, తెల్లని వస్త్రం, నెయ్యి, చక్కెర, పాలు, పెరుగు వంటి పదార్థాలను ఉంచి ఆలయానికి వెళ్లి పూజ చేయించుకోవాలి. తోచినంత డబ్బు దానం చేసి పండితుని వద్ద సంకల్పం చెప్పుకుంటే గ్రహణ దోషాల ప్రభావం తొలగిపోతుందని విశ్వాసం.
చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశుల వారికి జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల భక్తులు గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక క్రియాకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ అరుదైన ఖగోళ సంఘటన భక్తుల్లో భయం కాకుండా భక్తిని, శ్రద్ధను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచే అవకాశం అని చెప్పవచ్చు. రాత్రి ఆకాశంలో గ్రహణం కనిపిస్తూనే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జపధ్వనులు, మంత్రోచ్చారణలు మార్మోగడం విశేషంగా నిలిచింది.
