ఇంటి ఆవరణ అందంగా కనిపించాలని.. చాలామంది మొక్కలు పెంచుతారు. కానీ కొందరు మాత్రం మొక్క పెట్టేముందే ఒక ప్రశ్న అడుగుతారు .. ఇది వాస్తు ప్రకారంగా సరైనదేనా.. ముఖ్యంగా ముళ్లు ఉన్న మొక్కల విషయంలో చాలా మందికి భయం ఉంటుంది. అలాంటప్పుడు అందంగా కనిపించే గులాబీ మొక్క ఇంట్లో పెంచడం శుభమా? అశుభమా? అన్న సందేహం సహజంగా తలెత్తుతుంది. అయితే వాస్తు నిపుణులు చెప్పే సమాధానం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా ముళ్లు ఉన్న మొక్కలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయనే నమ్మకం ఉన్నా, గులాబీ మొక్క మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైనదని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పుష్పాల్లో గులాబీ ఒకటి కావడంతో, ఈ మొక్క ఇంట్లో ఉంటే శుభశక్తి పెరుగుతుందని నమ్ముతారు. గులాబీ ఇంటికి తీసుకువచ్చేది కేవలం అందం మాత్రమే కాదని, అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారు.
గులాబీ మొక్క ఇంట్లో పెంచడం వాతావరణం ప్రశాంతంగా మారుతుందని, అక్కడ నివసించే వారికి మానసిక స్థిరత్వం పెరుగుతుందని వాస్తు నమ్మకం చెబుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయని, కోపతాపాలు తగ్గుతాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షం అందడంతో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, ఇంట్లో సంతోషం స్థిరపడుతుందని కూడా వాస్తు విశ్వాసం పేర్కొంటుంది.
అయితే గులాబీ మొక్కను ఎక్కడ నాటుతున్నామన్నదే అసలు కీలకం. వాస్తు ప్రకారం ఉత్తర దిశ లేదా తూర్పు దిశలో గులాబీ మొక్కను పెంచితే అత్యంత శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఉత్తరం ధనస్థానంగా భావిస్తారు కాబట్టి ఆ దిశలో గులాబీ ఉంటే ఆదాయ వృద్ధి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని నమ్మకం. తూర్పు దిశ సూర్యోదయానికి సంకేతం కావడంతో, ఆ దిశలో మొక్కను ఉంచితే ఆరోగ్యం, కుటుంబ ఆనందం, ఉత్సాహం పెరుగుతాయని విశ్వసిస్తారు.
ప్రేమ సంబంధాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి గులాబీ ప్రత్యేక శక్తిని కలిగి ఉందని వాస్తు చెబుతోంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పారదర్శక గాజు పాత్రలో గులాబీ పువ్వును ఉంచి, ప్రతిరోజూ నీటిని మార్చితే జంటల మధ్య దూరాలు తగ్గి, అనుబంధం మరింత బలపడుతుందని నమ్మకం. ఇది భావోద్వేగ సమతుల్యతను తీసుకువచ్చి, మనసుల్లోని కలతను తగ్గిస్తుందని చెబుతారు.
ఇంట్లో గులాబీ మొక్క ఉంటే చెడు శక్తులు దూరమవుతాయని, సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తుందని వాస్తు విశ్వాసం. వ్యాపారం చేసే వారు తమ ఇంటి తూర్పు వైపున గులాబీ మొక్క పెంచితే లాభాలు పెరుగుతాయని, వ్యాపార అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయని చాలామంది నమ్మకం కూడా ఇదే చెబుతోంది. అయితే ఇవన్నీ శాస్త్రీయ ఆధారాల కంటే సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడిన విషయాలే. కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.. ఇంట్లో ఏ మొక్కను సంతోషంగా, శ్రద్ధగా పెంచినా అది మనసుకు ప్రశాంతతను, ఇంటికి తాజాదనాన్ని తప్పకుండా తీసుకువస్తుంది. గులాబీ అయితే ఆ అందానికి తోడు పరిమళంతో కూడా ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది.
