హిందూ నమ్మకాల ప్రకారం.. అప్పుడప్పుడు ఎదురయ్యే చిన్న సంఘటనే కానీ.. దానికి ప్రజల్లో ఉన్న నమ్మకం మాత్రం ఎంత పెద్దదో చెప్పలేం. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక పిల్లి మన ముందుగా అడ్డుగా వెళ్తే చాలామంది వెంటనే అక్కడే ఆగిపోతారు. కొందరైతే ఏదో అశుభం జరుగుతుందేమో అనే భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతారు కూడా. ఇంకొందరు అయితే పిల్లి దాటిన ప్రదేశంలో రాయి లేదా ఏదైనా వస్తువు విసిరి, దాని తర్వాతే ముందుకు అడుగు వేస్తారు. ఈ విధంగా పిల్లి అడ్డుగా వెళ్ళడం అనేది అనేక ప్రాంతాల్లో అపశకునంగా పరిగణిస్తారు.
ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చాలా కాలంగా కొనసాగుతున్న నమ్మకం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే.. పిల్లి దారిలో దాటితే నిజంగా ఏదైనా అశుభం జరుగుతుందా..? లేదా ఇది కేవలం మనసులో పెరిగిన భయమేనా. ఈ కథనంలో తెలుసుకుందాం.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం. ఇది పూర్తిగా మూఢనమ్మకమే అని చెబుతున్నారు. పిల్లి మనకి ఎదుటపడటం వెనుక ఎలాంటి శాస్త్రీయ కారణం లేదు. ఏ జంతువైనా ఎదురుపడితే తప్పు లేదు కానీ.. పిల్లిపై మాత్రం అశుభం అంటగట్టడం అర్ధరహితం అని చెబుతున్నారు. ఇలా జరిగినప్పుడు చాలా మంది భయపడుతుంటారని. ఒకవేళ పిల్లి ఎదురు పడితే మనకి ఏదైనా ప్రమాదం కలిగిందంటే.. వెంటనే అది పిల్లి వల్లనే జరిగిందన్న చాలా మంది బావిస్తుంటారని తెలిపారు. నిజానికి ఆ ప్రమాదానికి కారణం వారి నిర్లక్ష్యమే కావచ్చు. వాహనాన్ని అదుపులో పెట్టకపోవడం, దృష్టి మరలడం వంటివి అసలు కారణాలు అవుతాయని పండితులు చెబుతున్నారు.
ఇక పిల్లిపై ఉన్న ఈ అంధ విశ్వాసాలకు వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. పాత కాలంలో ఎలుకల వల్ల Plague వ్యాధి విపరీతంగా వ్యాపించేది. వేలాదిమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలంలో ఎలుకల సంఖ్య పెరగడంతో పిల్లులు వాటిని తినేవి. దీంతో ప్రజలు పిల్లులకి దూరంగా ఉండాలని, నిబంధన పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అవగాహన కోసం ఒక భ్రాంతి సృష్టించి ఉండవచ్చు. అదే భ్రాంతి కాలక్రమంలో అపశకునంగా మారింది.
నేటి కాలంలో కూడా ఈ నమ్మకం మారకపోవడం ఆశ్చర్యకరమే. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలు గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మంది చదువుకున్న వారు కూడా పిల్లి అడ్డుగా వెళ్తే ఆగిపోవడం చూస్తుంటాం. నిపుణులు మాత్రం ఈ అపోహను వదిలేయాలని, వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా పిల్లి దారిలో ఎదురు పడటం ఒక సహజ సంఘటన మాత్రమే. ఎలుకను లేదా వేరే జంతువును గమనించి పిల్లి దారిని దాటడం సహజం. అశుభం జరిగే అవకాశమే లేదు. ప్రమాదం జరిగితే అది పరిస్థితులపై, మన అప్రమత్తతపై ఆధారపడి ఉంటుంది కానీ పిల్లిపై కాదు. అని చెబుతున్నారు.
