Kalvakuntla Kavitha: పూలు, పాలు అమ్మి వేల ఎకరాలు కబ్జా చేశారని మల్లారెడ్డిపై కవిత ఫైర్

Kalvakuntla Kavitha: మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్‌లో పూలు, పాలు అమ్ముకొని వేల ఎకరాలు కబ్జా చేశారే తప్ప, గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదని ఆమె ఘాటు విమర్శలు చేశారు. ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించి, పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధి మాటలకే పరిమితం ముందుగా జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డును పరిశీలించిన కవిత, అనంతరం అంబేద్కర్‌నగర్‌లో బస్తీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడ్చల్‌లో అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

యువత భవిష్యత్తు అగమ్యగోచరం నియోజకవర్గంలో సరైన డిగ్రీ, జూనియర్ కళాశాలలు లేకపోవడాన్ని కవిత ఎత్తిచూపారు. విద్యావకాశాలు లేక యువత ఉన్నత చదువులకు దూరమవుతోందని, తద్వారా గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

భూముల క్రమబద్ధీకరణలో అన్యాయం.. సుప్రీంకోర్టుకు వెళ్తా జీవో నం.58, 59 కింద పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు ఎందుకు పూర్తి చేయలేదని కవిత ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరగలేదు కానీ, మాజీ మేయర్, మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు మాత్రం రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయని ఆరోపించారు. పేదల భూముల అంశంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని ఆమె హెచ్చరించారు.

కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపు అనంతరం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించిన కవిత, కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు.

Advocate Kota Ramachandra Reddy Special Interview || Legal Tips || Lawyer Saab || Telugu Rajyam