Water Tank: చలికాలంలో గీజర్ లేకుండా వెచ్చని నీరు కావాలా..? అయితే ఇలా చేయండి..!

శీతాకాలం వచ్చిందంటే చాలామంది ముందు ఎదుర్కొనే పెద్ద సమస్య చలి. ఉదయం బాత్రూమ్‌లోకి అడుగు పెడితే చాలు చలి చంపేస్తుంది. కుళాయి తిప్పగానే గోరువెచ్చని నీటి బదులు గడ్డకట్టించే చల్లని నీరు.. ఈ పరిస్థితుల్లో స్నానం చేయడం అంటే సాహసమే. గీజర్ పెట్టాలంటే వేల రూపాయల ఖర్చు, ఇమ్మర్షన్ రాడ్ వాడితే నెలాఖరులో విద్యుత్ బిల్లు చూసి షాక్ తగలడం. మధ్యతరగతి కుటుంబాలకు ఇది రోజూ భరించలేని సమస్యగా మారింది.

అయితే ఇప్పుడు ఇదంతా అవసరం లేకుండా, ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టకుండా కూడా ట్యాంక్‌లోని నీటిని చలికాలంలో వెచ్చగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు.పైకప్పుపై ఉండే వాటర్ ట్యాంక్ చల్లని గాలికి నేరుగా గురవ్వడంతో రాత్రికిరాత్రే ఐస్‌లా మారిపోతుంది. ఇక్కడే ఒక చిన్న దేశీ ఆలోచన పెద్ద సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. ట్యాంక్ చుట్టూ సాధారణ థర్మోకోల్ షీట్ కట్టేయడం వల్ల, బయట చలి లోపలికి చొరబడదు. లోపల ఉన్న వేడి కూడా బయటకి పోదు. ఇది మనం చలిలో స్వెటర్ వేసుకున్నట్టే.. నీటికి కూడా ఒక రక్షణ కవచం లాంటిది. ఒక్కసారి కప్పేస్తే రాత్రంతా ఎంత చలి ఉన్నా ఉదయం నీరు చల్లగా మారదు.

ఇక ఇంటికి వచ్చే ఆన్‌లైన్ ప్యాకేజీల బబుల్ ర్యాప్‌ని చాలా మంది చెత్తలో పడేస్తారు. కానీ అదే మీ ట్యాంక్‌కు సూపర్ ఇన్సులేషన్ షీల్డ్‌గా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ట్యాంక్ చుట్టూ రెండు మూడు పొరలుగా బబుల్ ర్యాప్ చుట్టేస్తే లోపల గాలి పొరలు ఏర్పడి చలి ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. పని అయిపోవడానికి రెండు నిమిషాలే సరిపోతాయి, ఫలితం మాత్రం రోజంతా ఉంటుంది.

ట్యాంక్ పూర్తిగా ఆరుబయట ఉంటే దానిపై ఏదో ఒక కవర్ తప్పనిసరిగా ఉండాలి. టార్పాలిన్ అయినా, ప్లాస్టిక్ షీట్ అయినా, పాత దుప్పటి అయినా, చిన్న టిన్ షెడ్ అయినా సరే, పై నుంచి కప్పితే చలి నేరుగా నీటిపై పడదు. ముఖ్యంగా రాత్రివేళలు ఈ కవర్ చాలా కీలకంగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బస్తాలు లేదా పాత దుప్పట్లతో ట్యాంక్‌ను కప్పడం ఒక నమ్మకమైన పద్ధతిగానే కొనసాగుతోంది.

మరొక సులభమైన కానీ శక్తివంతమైన ట్రిక్ ట్యాంక్‌ను ముదురు రంగులో పెయింట్ చేయడం. నలుపు, డార్క్ బ్లూ లేదా డార్క్ బ్రౌన్ రంగులు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. దాంతో పగటంతా నీరు కొద్దిగా వేడెక్కుతుంది. ఆ వేడి రాత్రివేళ కూడా కొంతమేర నిలుస్తుంది. ఒక్కసారే పెయింట్ చేస్తే సంవత్సరాల తరబడి ఉపయోగపడే చౌక పరిష్కారం ఇదే.