తిరుమల స్వామి వారి విశేషాలు ఇన్ని అన్నికాదు. అనంతం. అందుకే స్వామిని అనంతుడు అని కూడా అంటారు. అయితే బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు పెరిగేకొద్దీ స్వామివారు ఊరేగే వాహనాల సంఖ్య కూడా పెరగడాన్ని మనం శాసనాల్లో చూడవచ్చు.
శ్రీ వేంకటేశ్వరుడు తన దేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కలిసి, బ్రహ్మోత్సవాల సమయంలో ఏరోజు ఏ వాహనంలో దర్శనమిస్తారో సాహిత్యంలో, శాసనాల్లో ఉంది. బ్రహ్మోత్సవం ఎన్నిరోజులు జరిగినా ధ్వజారోహణంతో ప్రారంభమై, ధ్వజావరోహణంతో ముగుస్తుంది. మధ్యలో ఒక్కోరోజు ఒక్కోవాహనంలో స్వామి కనిపిస్తారు.