వైఎస్ జగన్ ప్రజాకర్షణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన సభ జరిగుతోంది అంటే వేలాదిగా తరలివస్తుంటారు జనం. పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన సభలు, సమావేశాలు జన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటివరకు జగన్ పెట్టిన ఈ సమావేశం కూడ జనం లేక వెలవెలబోలేదు. ఎన్నికలకు ముందు జగన్ వెంట నడిచిన ఆ జనప్రవాహమే ఆయన గెలుపును స్పష్టంగా చూపించింది. ఎన్నికల ఫలితాల్లో అదే నిజమైంది. అందుకే అదే ఫార్ములాను తిరుపతి ఉపఎన్నికల్లో ప్లే చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని గెలవాలని వైసీపీ, ఈ ఎన్నికలతో పుంజుకోవాలని టీడీపీ, తమకు కూడ బలముందని నిరూపించుకోవాలని జనసేన – బీజేపీ కూటమి తహతహలాడుతున్నాయి.
అయితే ముందుగా ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించింది మాత్రం చంద్రబాబు నాయుడే. పాత అభ్యర్థి పనబాక లక్ష్మికే టికెట్ ఖరారు చేశారు. ఆమె గెలుపు కోసం కసరత్తులు స్టార్ట్ చేశారు. స్థానిక నేతలను అలర్ట్ చేసి ఎన్నికల స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మను రంగంలోకి దింపారు. గ్రవుండ్ వర్క్ ఇప్పటి నుండే మొదలైంది. అయితే లోక్ సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉండటంతో ఇక్కడ టీడీపీ బలమెంత ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఒకటిన్నర ఏడాదిలో ఏమైనా పుంజుకుందా లేదా అనేది తేలాలి. అయితే వైసీపీ వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంది. అందరూ ఎన్నికల సంసిద్ధతలో కిందా మీదా పడుతుంటే వైసీపీ నేతలు మాత్రం మేము ఎప్పుడో రెడీ. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా గెలుపు మాదే అంటూ ధీమాగా ఉన్నారు.
అధికార పార్టీ కాబట్టి ఆమాత్రం గాంభీర్యం కామన్ అని, ఎన్నికలకు వెళితే కదా వ్యతిరేకత ఎంతుందనేది బయటపడేది అంటూ వైసీపీ మీద కౌంటర్లు పడుతున్నాయి. వీటికి సమాధానం చెప్పడం కోసమే తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ఈరోజు వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో తిరుపతిలో భారీ ర్యాలీ తీశారు. ర్యాలీ అంటే అలా ఇలా కాదు. ఏకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఉందా ర్యాలీ. ఈ ర్యాలీలో సుమారు 20 వేల మంది పాల్గొన్నారట. కిలోమీటర్ మేర జనసంద్రం నిండిపోయింది. జగన్ ఫోటోలతో, పాటలతో, వైసీపీ నినాదాలతో తిరుపతి హోరెత్తిపోయింది. ఆ జనాన్ని చూస్తే జగన్ వస్తున్నారనే సందేహం కలిగింది.
కేవలం ఎమ్మెల్యే చేసిన ర్యాలీకే ఇంతమంది జనం వస్తే ఇక జగన్ దిగితే పరిస్థితి ఇంకెంత భీకరంగా ఉంటుందో అనిపిస్తోంది. మొత్తానికి జగన్ పుట్టినరోజును వేదికగా చేసుకుని వైసీపీ నేతలు ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ బలగాన్ని, పార్టీ బలాన్ని చూపెట్టి ఎన్నికలకు ముందే గెలుపు మాదేనంటూ ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనిచేశారు. ఈ ర్యాలీ అటు అధిష్టానంలో కూడ ఆనందాన్ని నింపింపింది. మళ్ళీ పాదయాత్రన నాటి రోజులను గుర్తుచేశారని చెప్పుకుంటున్నారు ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు.