2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా.. ఫలితాలు మాత్రం సగటు వైసీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈవీఎంపై పలు ఆరోపణలు వచ్చినా.. అది ప్రస్తుతానికి అప్రస్తుతం! ఈ క్రమంలో.. వైసీపీ ఆ దెబ్బ నుంచి ఏ మేరకు కోలుకుంది.. ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ అయిపోయిన తర్వాత 2025లో సమస్యలపై ఏ మేరకు పోరాడింది.. పార్టీ నిలబడిందా.. 2029పై ఆశలను కల్పించిందా..? ఈ సందర్భంగా ఎన్నో ప్రశ్నలు..!!
2024 ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి వైసీపీ తేరుకున్నట్లేనా..?
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ, ఇవ్వనప్పటికీ.. ప్రజల తరుపున సమస్యలపై మీడియాలో గళం గట్టిగానే వినిపించిందా..?
రెడ్ బుక్ అంటూ భయాందోళనలు కలిగించిన వేళ.. పార్టీ ధైర్యంగా నిలవగలిగిందా.. కేడర్ నిలబడ్డారా..?
కాలుకి కాలు, కీలుకి కీలు విరిచేస్తాననే ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు బెదరక వైసీపీ శ్రేణులు ఉండగలిగారా..?
2026లో వైసీపీ ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్లగలుగుతుంది.. కార్యకర్తల్లో మరింతగా ఎలా భరోసా నింపగలుగుతుంది.. ప్రజలకు ఏ మేరకు నమ్మకం కలిగించగలుగుతుంది..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 లో 151 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ 11 స్థానాలకు పడిపోవడం చిన్న దెబ్బ కాదు! అందువల్లే.. ఆ తర్వాత ఏడాది వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన సంవత్సరం అనే చర్చ బలంగా నడించింది. జగన్ ఇంక బెంగళూరుకే పరిమితం అనే వ్యంగపు మాటలూ వినిపించాయి. పులివెందుల ఎమ్మెల్యే అనే వెటకారాలు ధ్వనించాయి.
అయితే.. 2025లో జగన్ వ్యవహారం.. ఆయన పార్టీ విషయంలో తీసుకునే నిర్ణయాలు.. చాలామంది ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రభావం చూపించాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి 151 నుంచి 11 అనేది చిన్న దెబ్బ కాదు! అయితే జగన్ అదృష్టమో.. కార్యకర్తల అదృష్టమో తెలియదు కానీ… గతంలో ఓడిపోయాక కనీసం మూడు, మూడున్నరేళ్ల వరకూ బెంగ పానుపు దిగని నేతలున్న ఈ రోజుల్లో… జగన్, ఆ పార్టీ కార్యకర్తలు వేగంగా పుంచుకోగలిగారు!

ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలోని లోపాలను ఎత్తి చూపడంలో జగన్ ముందున్నారు. జగన్ ఇచ్చిన పథకాలను కొనసాగిస్తూనే.. అంతకు మించి ఇస్తామంటూ కూటమి నేతలు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసిన వ్యవహారాలను… “ఉన్న పలావూ పోయింది.. ఇస్తామన్న బిర్యానీ పోయింది” అంటూ తనదైన శైలిలో ప్రజలకు అర్ధమయ్యేలా.. ప్రభుత్వ పెద్దలకు గుయ్ మనేలా చెప్పగలిగారు!
ఇదే సమయంలో.. వరి, మిర్చి, పొగాకు, మామిడి, అరటి మొదలైన రైతుల సమస్యల విషయంలో బలమైన గళం వినిపించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. అక్కడ వాలిపోవడానికి ప్రయత్నించేవారు. ఇక ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానంగా.. రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనల, ప్రభుత్వంపై ఒత్తిడి విషయంలో జగన్ సక్సెస్ అయారనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.
ఇదే సమయంలో… పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అవ్వకుండా చూసుకునే విషయంలోనూ జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇదే సమయంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా జగన్ ని వదలని విషయంలో ఆ ఎమ్మెల్యేలు, నాయకులకూ మంచి మార్కులే పడ్డాయని చెబుతున్నారు. అదేవిధంగా రెడ్ బుక్ పేరు చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అన్నింటికీ ఓర్చి రోజురోజుకీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్న వైసీపీ కేడర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

దీనికితోడు.. ఇటీవల క్రిస్మస్ వేడుకల్లో తల్లి విజయమ్మ చూపించిన అప్యాయత.. జగన్ పుట్టిన రోజున చెల్లెలు షర్మిల శుభాకాంక్షలు కూడా పాజిటివ్ సంకేతాలే అని చెబుతున్నారు! ఆమె వాస్తవాలు గ్రహించి ఉంటారని అంటున్నారు! ఇక… “బాబాయ్ హత్య” అంటూ విమర్శలు చేసిన వివేకా మృతి కేసు విషయంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ హత్య జరిగినప్పుడు జగన్ కు ఫొన్ వచ్చిందనే విషయాన్ని తోసి పుచ్చి, విమర్శకుల నోర్లు మూయించిందనే చర్చా వైరల్ గా మారిన పరిస్థితి!
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా… ఈ ఏడాది చివర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం ఎంచుకున్న పీపీపీ విధానంపై జగన్ పూరించిన సమర శంఖారావం ఈ ఏడాది సూపర్ హిట్ క్లైమాక్స్ లా మారిందని చెప్పినా అతిశయోక్తి కాదు! ఓ పక్క బలమైన కూటమి ప్రభుత్వం ఉండగా.. కేంద్రంలోనూ వారే అధికారంలో ఉండగా.. కోటి సంతకాల సేకరణ.. టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడం… కచ్చితంగ జగన్ చూపించిన ప్రభావనే కామెంట్లను సొంతం చేసుకుంది.
ఏది ఏమైనా… 2024లో తగిలిన భారీ దెబ్బ నుంచి ఉన్నంతలో తొందరగానే తేరుకున్న జగన్… ప్రజాపక్ష నాయకుడిగా 2025లో సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇందుకు జగన్ పనితనం ఎంతో కీలకంగా మారితే.. ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు! మరి 2026లో వైసీపీ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందనేది వేచి చూడాలి!

