విశాఖపట్నం మన్యం ప్రాంతంలో తీవ్ర అలజడులకు కారణమవుతున్న బాక్సైట్ తవ్వకాలపై జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల జీవనానికి అటంకంగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలను నిలిపేయాలని చెప్పారు. నిజానికి బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు ఎప్పటి నుండో వ్యతిరేకిస్తున్నారు.
అయితే గిరిజనుల్లోనే కొందరు మాత్రం వ్యాపారస్తులతో కుమ్మకై తవ్వకాలను అనధికారికంగా సాగిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలు జరగటం లేదని చంద్రబాబునాయుడు కూడా చాలాసార్లే చెప్పినా తెరవెనుక మాత్రం జరిగే తవ్వకాలు జరిగిపోతునే ఉన్నాయి.
ఈ తవ్వకాల కారణంగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అడవుల్లోకి యధేచ్చగా చొచ్చుకుని వెళ్ళిపోతున్నారు. దాంతో రోడ్లు వేయటం, వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకనే మావోయిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు సహకరిస్తున్నారన్న కారణంతోనే మావోయిస్టులు పలువురు గిరిజన నేతలను కాల్చి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఏదేమైనా బాక్సైట్ తవ్వకాలన్నది కొందరి ఆదాయానికి కల్పతరువుగా మారిందన్నది వాస్తవం. పాదయాత్ర సందర్భంలో కూడా చాలామంది గిరిజనులు జగన్ ను కలిసి బాక్సైట్ తవ్వకాలను నిలిపేయాలంటూ మొత్తుకున్నారు. కారణాలేవైనా కానీండి బాక్సైట్ తవ్వకాలను నిలిపేస్తు జగన్ నిర్ణయించారు. జగన్ తాజా నిర్ణయంతో రాజకీయాలతో సంబంధం లేని కొన్ని వేలమంది గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
