జేసి ధైర్యానికి పెద్ద పరీక్షే మొదలైంది. మీడియా ముందు, నేతలతో మాట్లాడిన మాటలనే ఎన్నికల కమీషన్ ముందు కూడా రిపీట్ చేస్తారా లేదా అన్నదే జేసికి పెద్ద పరీక్షగా మారింది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడనే ముసుగులో నోటికొచ్చినట్లు మాట్లాడే జేసి ఈమధ్య ఎన్నికల వ్యయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఎంపి ఎలక్షన్లో తాము రూ. 50 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఆ వ్యాఖ్యలే ఇపుడు జేసి మెడకు చుట్టుకున్నాయి.
ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత ఎన్నికల్లో పెరిగిపోతున్న ఎన్నికల వ్యయంపై జేసి నీతులు చాలానే చెప్పారు. మొన్నటి అనంతపురం పార్లమెంటులో తాము రూ 50 కోట్లు వ్యయం చేసినట్లు కూడా చెప్పారు. ఎప్పుడైతే జేసి వ్యాఖ్యలు చేశారో వెంటనే ప్రతిపక్షాలు ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేశాయి. ఈసి సూచనలతో విచారణ బాధ్యతను రిటర్నింగ్ అధికారికి కలెక్టర్ అప్పగించారు.
మీడియాతో మాట్లాడుతూ జేసి చేసిన వ్యాఖ్యలను రిటర్నింగ్ అధికారి తెప్పించుకున్నారు. జేసి వ్యాఖ్యలు వాస్తవమే అని రిటర్నింగ్ అధికారి తేల్చుతునే ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు కావాలని జేసికి నోటీసిచ్చారు. అదే సమయంలో కలెక్టర్ కూడా మరో కమిటీని వేసి నిజాలు తేల్చమన్నారు.
నిజానికి వారసుల గెలుపు కోసం జేసి బ్రదర్స్ చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఖర్చు చూసుంటారనటంలో సందేహం లేదు. ఎందుకంటే, చాలా పార్లమెంటు నియోజకవర్గల్లో ఎన్నికల ఖర్చు 100 కోట్ల రూపాయల టచ్ అవుతోంది. అదే విషయాన్ని జేసి చెప్పారు. ఈరోజో రేపో విచారణ కమిటి ముందు జేసి హాజరుకాక తప్పదు. అప్పుడు తాము రూ 50 కోట్ల ఖర్చు చేసింది నిజమే అని అంగీకరిస్తారా ? లేకపోతే మీడియా ముందు ఏదో గొప్ప కోసం రూ 50 కోట్లు చెప్పానని బుకాయించి తప్పించుకుంటారా చూడాలి.