జేసీ దివాకర్ రెడ్డి ఏపీని వదిలేసి, తెలంగాణకి వెళ్ళిపోతార్ట.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొట్టిన పొలిటికల్ దెబ్బకి మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి తన మకాం తెలంగాణకి మార్చెయ్యబోతున్నారట. ఆంధ్రప్రదేశ్ వదిలేసి, తెలంగాణకు వచ్చేస్తానంటూ తెలంగాణలో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. రాయల తెలంగాణ.. అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విభజన, సమైక్య ఉద్యమాల సమయంలో జేసీ దివాకర్ రెడ్డి సహా కొందరు రాజకీయ నాయకులు.. అందునా, సీమ నేతలు నినదించిన విషయం విదితమే. అయితే, రాయల తెలంగాణ, గ్రేటర్ తెలంగాణ లాంటి నినాదాలకు పెద్దగా పాపులారిటీ దక్కలేదు. ఇక, చంద్రబాబు హయాంలో ఎంపీగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డి, ఓ పోలీస్ అధికారితో పొలిటికల్ పంచాయితీ పెట్టుకుని.. పరువు పోగొట్టుకున్నారు.

సదరు పోలీస్ అధికారి, ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. దాంతో, జిల్లాలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి వచ్చింది జేసీ దివాకర్ రెడ్డికి. టీడీపీ అధికారంలో వున్నప్పుడు, వైసీపీ మీద.. వైసీపీ అధినేత మీద జేసీ దివాకర్ రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ బ్రదర్స్ ఆగడాలకి చెక్ పెట్టడం అందరికీ తెలిసిందే. ‘మా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు..’ అంటూ పదే పదే వాపోయింది జేసీ కుటుంబం. జిల్లాలో, రాయలసీమలో, మొత్తం ఆంద్రప్రదేశ్‌లో రాజకీయంగా పూర్తిస్థాయిలో పలుకుబడిని కోల్పోయిన జేసీ దివాకర్ రెడ్డి, తెలంగాణకి మకాం మార్చేయాలన్న ఆలోచన చేయడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించబోదు.. ఎందుకంటే ఆయనకు మరో ఆప్షన్ లేదు కూడా.