మునుగోడు టిఆర్ ఎస్ నేత వేనేపల్లి వెంకటేశ్వరరావు బహిష్కరణతో టిఆర్ ఎస్ పార్టీలో చిచ్చు రేగింది. వేనేపల్లి వెంకటేశ్వరరావు వర్గీయులు మూకుమ్మడి రాజీనామాకు సిద్దమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని వేనేపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వేనేపల్లి బహిష్కరణతో వేనేపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువ లేని పదవులు మాకు అవసరం లేదని వారు గరమయ్యారు. వేనేపల్లి బహిష్కరణకు నిరసనగా నాంపల్లి ఎంపీపీ దండిగ నాగమణి వెంకటయ్య, చిట్టెం పహాడ్ ఎంపీటిసి కళమ్మ సత్యనారాయణ, దేవాశ్ పల్లి ఎంపీటిసి మాధవి యాదగిరి, స్వాముల వారి లింగోటం ఎంపీటిసి పి. శీనయ్య , తాజా మాజీ సర్పంచ్ లు, కార్యకర్తలు పదవులతో పాటు టిఆర్ ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమయ్యారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆరాచకాలపై పోరాడితే లభించిన గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కూసుకుంట్ల ఏ రోజు కూడా ప్రజాప్రతినిధులతో సక్కగ ఉన్న పాపాన పోలేదని వారు విమర్శించారు. నిత్యం ఎంత దోచుకుందాం అని చూసోటోడే తప్పా కూసుకుంట్ల మునుగోడు ప్రజలకు చేసిందేం లేదన్నారు. సమస్యల వలయంలో మునుగోడు అల్లాడుతుంటే పోయి హైదరాబాద్ కొత్తపేటల పండుకున్న మహానుభావుడని ఎద్దేవా చేశారు. ఫ్లోరోసిస్ సమస్యలతో బాధపడుతుంటే సాగర్ జలాలు అందించలేని చేతకాని వాడన్నారు. గట్టుప్పల్ మండల ఏర్పాటును ఆపిన దరిద్రుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డని రాజీనామా చేసిన నేతలన్నారు.
కూసుకుంట్ల చేస్తున్న దొంగ పనులను వ్యతిరేకిస్తే వేనేపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. గులాబీ జెండా భుజాలపై మోసి కేసీఆర్ ఆశయాలకోసం పోరాడితే ఈ రోజు ఈ గతి పట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేనేపల్లి వెంకటేశ్వరరావు హరీష్ రావుకు మంచి సన్నిహితుడని అది ఓర్వలేక కొంత మంది దుర్మార్గులు ఇవాళ పథకం ప్రకారం సస్పెండ్ చేయించారన్నారు.
వేనేపల్లి వెంకటేశ్వరరావు మునుగోడు నియోజకవర్గంలో మూడు మండలాలను ప్రభావితం చేయగల బలమైన నాయకుడన్నారు. మునుగోడు, చండూరు, నాంపల్లి మండలాల్లో తిరుగులేని నేతని వచ్చ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓటమి ఖాయమన్నారు. వేనేపల్లిని తొలగించి మునుగోడు ఓటమిని టిఆర్ ఎస్ తన ఖాతాలో వేసుకుందన్నారు. టిఆర్ ఎస్ , కేసీఆర్ అంటే అభిమానం కానీ కూసుకుంట్ల ను మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని అతని ఓటమి ఖాయమని వారు దుయ్యబట్టారు.
పదవిలో లేకున్నా ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడి ఉద్యమించిన వాడు వెంకటేశ్వరరావని అటువంటి నేతకు మేమంతా అండగా ఉంటామని వారన్నారు. కూసుకుంట్ల అవినీతి చేస్తుంటే మంత్రి హారీష్ రావుకు లేఖ రాసి కూసుకుంట్ల మోసాలను బహిరంగంగా చెప్పామన్నారు. పార్టీ అధినాయకుడు కూడా ఆలోచించాలన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వేనేపల్లిని బహిష్కరించే ముందు మునుగోడు గడ్డ మీదకి వచ్చి పరిస్థితి తెలుసుకుంటే బాగుండేదని వారు హితవు పలికారు.
వేనేపల్లి నిత్యం ప్రజలందరిని కలుపుకొని పోయి ప్రజల క్షేమం కోసం పనిచేశారన్నారు. కూసుకుంట్ల పోయి హైదరాబాద్ ల పండితే ప్రజలకు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా వేనేపల్లి అండగా ఉన్నారన్నారు. వేనేపల్లికి మునుగోడు ప్రజలు అండగా ఉన్నారని, ఎటువంటి చర్యలకు కూడా భయపడేదే లేదని అందుకే రాజీనామా చేస్తున్నామని నేతలన్నారు. అసెంబ్లీ అభ్యర్దులను ప్రకటించాక టిఆర్ ఎస్ మొట్టమొదటగా వేనేపల్లి పై వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ ప్రారంభమైంది.