మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అదేంటీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి వస్తుంటే, కాంగ్రెస్ బలోపేతమవ్వాలి కదా తెలంగాణలో.! అదే మ్యాజిక్కు.!
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే.. అస్సలెవరికీ అర్థం కాదు. అన్నదారి అన్నదే, తమ్ముడి దారి తమ్ముడిదే. కానీ, ఇద్దరూ కలిసే రాజకీయం చేస్తారు. విడివిడిగా వున్నా, కలిసి మెలిసి రాజకీయం చేయడం ఈ ఇద్దరి ప్రత్యేకత.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరారు. తద్వారా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు, గులాబీ పార్టీ గెలిచింది. గెలిచి వుంటే, బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన గౌరవం దక్కి వుండేదేమో.
గౌరవం దక్కినా, దాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలబెట్టుకోరు కదా.! అదే ఆయన ప్రత్యేకత సుమండీ.! ఇప్పుడేమో, తన సోదరుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న విషయమే తనకు తెలియదంటూ కొత్త డ్రామాకి తెరలేపారు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
గజ్వేల్‌లో పోటీ చేస్తా, కామారెడ్డిలో పోటీ చేస్తా.. అంటూ కొత్త కథలు మొదలెట్టిన రాజగోపాల్ రెడ్డి విషయమై చిత్ర విచిత్రంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుండడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త గందరగోళం బయల్దేరింది. రేపో మాపో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి, కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తారట. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరవెనుకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు.
సహజంగానే ఇదంతా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మింగుడు పడ్డంలేదు. ఎన్నికల సమయంలో ఈ లొల్లి ఏంటో రేవంత్ రెడ్డికి అస్సలు అర్థం కావడంలేదాయె. అదే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయమంటే.! కాంగ్రెస్ శ్రేణులూ ఈ విషయమై తీవ్ర అయోమయానికి గురవుతున్నాయి.