గులాబీ పిలుస్తోంది.! ఈటెల కాషాయాన్ని వదిలేస్తారా.?

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన అత్యంత కీలక నేత ఒకప్పుడు. ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. తనకు అత్యంత సన్నిహితుడైన ఈటెల విషయంలో ఎక్కడ తేడా వచ్చిందోగానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఆయన మీద గుస్సా అయ్యారు.. ఈ క్రమంలో ఈటెల మంత్రి పదవి కోల్పోవడం, గులాబీ పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీలో చేరి.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడం తెలిసిన విషయమే.

కానీ, బీజేపీలో ఈటెల రాజేందర్ ఇమడలేకపోతున్నారు. కమ్యూనిస్టు భావజాలం నుంచి రాజకీయాల్లోకొచ్చిన ఈటెల, బీజేపీలో కొనసాగడం అంత తేలిక కాదు. కానీ, సర్దుకుపోతున్నారు. అయితే, పరిస్థితులు మారాయి. ఈటెల మీద మళ్ళీ కేసీయార్ ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారు. దాంతో, ఈటెల తిరిగి గులాబీ గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతోంది.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే ఈటెల రాజేందర్‌ని లాగెయ్యాలని టీఆర్ఎస్ ప్రయత్నించి విఫలమయ్యింది. కానీ, ఈసారి గులాబీ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేలానే వున్నాయి. ఈటెల కూడా, తిరిగి గులాబీ పార్టీలో చేరడానికి కాస్త సుముఖంగానే కనిపిస్తున్నారట. ‘నన్ను గెంటేసిన పార్టీలోకి తిరిగి వెళ్ళేది లేదు..’ అని ఈటెల చెబుతున్నా, గులాబీ పార్టీపై ఎక్కడో హృదయాంతరాల్లో వున్న మమకారం తిరిగి ఆయన్ను గులాబీ పార్టీ వైపు నడిపిస్తుందని కేసీయార్ బలంగా నమ్ముతున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.