తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాలకు సంబంధించి బుదవారం హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో స్పోర్ట్స్, వికలాంగుల కోటాని విస్మరించడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లు లేకుండా ఎలా నోటిఫికేషన్ ఇచ్చారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 95 శాతం స్పోర్ట్స్, వికలాంగుల వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సెక్రటరీ నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.
ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై, 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడంపై కూడా పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి ప్రభుత్వం పరీక్ష నిర్వహించి మెరిట్ లిస్ట్ ప్రకటించింది. మెరిట్ లిస్టులను నేరుగా జిల్లాల కలెక్టర్లకు పంపించింది. దీంతో నియామక ప్రక్రియ పై పంచాయతీ కార్యదర్శి అభ్యర్దులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియ పై అనుమానాలున్నాయన్నారు. కీ పేపర్ విడుదల చేయకుండా, ఫలితాలు ప్రకటించకుండా నేరుగా మెరిట్ లిస్ట్ ఎలా పెడుతారని వారు ప్రశ్నించారు. దీంతో కొంత మంది అభ్యర్దులు నియామక ప్రక్రియ పై హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టుకు వెళ్లిన తర్వాత అభ్యర్దుల మార్కుల వివరాలు, కీ పేపర్ ను విడుదల చేశారు. అభ్యర్దులకు ప్రశ్నా పత్రాలు ఇవ్వలేదు. కీ పేపర్ ఎలా చూసుకోవాలని పలువురు ప్రశ్నించారు. నియామకాలల్లో కూడా రిజర్వేషన్ల విధానం పాటించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు రిజర్వేషన్లు కోటా ఏ విధంగా తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వికలాంగుల కోటా, స్పోర్ట్స్ కోటా అసలే లేకపోవడంతో కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్యోగ నియామకానికి సంబంధించి కనీస రూల్స్ పాటించకుండా లెలా నియామకాలు చేస్తారని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అభ్యర్దుల మార్కుల వివరాలు, రిజర్వేషన్ల కేటాయింపు, ఏ ఏ జిల్లాలో ఎన్ని మార్కులను కటాఫ్ గా నిర్ణయించారో వాటి వివరాలు, తెలుగులో కాకుండా 14 ప్రశ్నలను పూర్తిగా ఇంగ్లీషులో ఇవ్వడం పై దాని వివరణ అన్ని కలిపి సోమవారం వరకు కోర్టులో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా నియామకపు పత్రాలు అందజేయవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకనొక దశలో న్యాయమూర్తి ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మళ్లీ కోర్టులో వాదనలు జరగనున్నాయి.