తమిళనాడు ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక బ్రాహ్మణేతర వ్యక్తిని ఒక గుడికి పూజరిగా నియమించింది. సాంఘిక విప్లవాలకు పేరొందిన తమిళనాడులో ఇదొక నూతనాధ్యాయం కానుంది. అయితే, దేశంలో ఇపుడున్న పరిస్థితి వల్ల ఈ పూజారి తన పేరును రాయవద్దని మీడియాను కోరుకున్నారు. ఆందుకే ఆయన పేరు పైకి రావడం లేదు. మార్చిలో ఈ నియామకం జరిగింది. ఇపుడు జాతీయ వార్త అయింది. కారణం ఈ నియామకం వెనక ఉన్న శక్తి డిఎంకె పెద్దాయన ఎం కరుణానిధి, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో ఆయన జీవిత చరిత్ర చర్చనీయాంశమయింది. ఈసందర్భంగా నే బ్రాహ్మణేతర పూజారి నియామకం వార్తల్లోకెక్కింది.
కరుణానిధికి ఈ నియామకానికి వున్న సంబంధం ఏమిటంటే, బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించవచ్చని 2006 ముఖ్యమంత్రి అయినపుడు కరుణానిధి చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం బ్రాహ్మణేతరును పూజారులుగా నియమించేందుకు వీలుకల్పిస్తూ వారికి పౌరహిత్యం,ఇతర ఆగమ శాస్త్ర వ్యవహారాలలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. తమిళనాడు దాదాపు 2007లో 206 మందికి ఇలా శిక్షణ ఇచ్చారు. శిక్షణలో పాసయిన వారికి ప్రభుత్వం సర్టిఫికేట్లు కూడా ఇచ్చింది.
అయితే, బ్రాహ్మణేతర పూజారుల నియమాక వ్యవహారం కోర్టు కెళ్లడంతో ఈ నియామకాలు మూలన పడ్డాయి. అయితే, కరుణానిధి తీసుకువచ్చిన జివొ రాజ్యాంగ బద్ధమేనని, బ్రాహ్మణేతరును పూజారులుగా నియమించవచ్చని 2015లో సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఇపుడు అధికారంలో ఉన్న ఎఐడిఎంకె ప్రభుత్వం ఒక అర్చకుడి పోస్టుకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం నలుగురు వ్యక్తులు దరఖాస్తు చేశారు. ఇందులో ప్రభుత్వశిక్షణా సంస్థ లో శిక్షణ పొందిన వ్యక్తి ఎంపిక య్యాడు. ఇపుడు వార్తల్లో ఉన్న అర్చకుడాయనే.
ఇది చిన్న నియామకం కావచ్చు.ఎక్కడో మారుమూల గుడిలో బ్రాహ్మణేరుడు అర్చకుడిగా పనిచేయవచ్చు. అయితే, దక్షిణాది రాష్ట్రాలలో వస్తున్న సాంఘిక సంస్కరణలను తీసుకున్నపుడు ఇది చాలా పెద్ద మార్పు కిందే లెక్క. కాని,దళితవాదులు ఈ నియామకాలనే తప్పుపడుతున్నారు. దళితుడి హిందూమతంలో చోటేలేదు, గుళ్లలోకి ప్రవేశమే లేదు, అసలుహిందూ ధర్మమే దళితులకు వ్యతి రేకం ఇలాంటపుడు, దళితుడి హిందూ పూజారిగా నియమించడం హాస్యాస్పదం అనేది దిళితుల వాదన.
ఇపుడు వార్తల్లో ఉన్న పూజారికి ఆగమశాస్త్ర శిక్షణ సర్టిఫికెట్ ఉన్నా శాస్త్రోక్తంగా పూజలు జరిగే గుడికి ఈనియామకం జరగకపోవడం మరొక విమర్శకు తావిస్తోంది. ఎందుకంటే, ఆగమశాస్త్రం ప్రకారం విధులు నిర్వర్తించడం అమలులో ఉండే గుడిలో బ్రాహ్మణేతర పూజారిని నియమించినపుడే నిజమయిన సంస్కరణ అవుతుందని సంస్కరణ వాదులు చెబుతున్నారు. ఇపుడు బ్రాహ్మణేతర పూజారిని నిమమించిన గుడి పురాతనమైందున ప్రభుత్వం అజమాయిషీలోకి వచ్చిందని, అందువల్లే అక్కడ పూజారులను నియమించారని వారు చెబుతున్నారు. శిక్షణ పొందిన వారిలో ఇంకా 205 మంది మిగిలిపోయి ఉన్నారు. ఎఐడిఎంకె ప్రభుత్వం వారిని అర్చకులుగా ప్రధాన గుడులలో నియమించాలని, వారిలో కొందరినయినా ఆగమశాస్త్ర పరిధిలో ఉండే గుడులలో నియమించినపుడే ప్రభుత్వానికి సంస్కరణ నిజాయితీ ఉందని, అది గొప్పదనం అవుతుందని వారు అంటున్నారు.
కంచె ఐలయ్య వాదన..
ఇది నిజమయిన సంస్కరణ కాదు అని ప్రఖ్యాత రాజకీయ తత్వవేత్త కంచె ఐలయ్య అంటున్నారు.
దేశంలోని ప్రధాని గుడులయిన తిరుమల,మధుర, ఉడుపి, గురువాయూర్, వైష్ణోదేవి ఆలయాలలో అర్చకులుగా శూద్రులువచ్చినపుడే నిజమయిన సంస్కరణ అవుతుంది. దళితులే కాదు, మొత్తం శూద్రకులాలన్నింటిని అర్చకత్వం లో అంటరాని వారుగానే చూస్తున్నారు. ఇది పోవాలి. ఎందుకంటే, శూద్రకులాలన్ని హిందూమతంలో భాగమయినపుడు అర్చకత్వ హక్కు (Right to priesthood) అన్ని కూలాలకు సమానంగా ఉండాలి. దళితులేకాదు, విపరీతంగా కానుకలిచ్చే రెడ్లు, కమ్మ వెలమ, బిసి కులాలకు కూడా ఈ హక్కు రాలేదు. ఇది చర్చనీయాంశం కావాలి. అర్చక వ్యవస్థలోకి అన్ని శూద్రకులాలు, దళితులతో రావడమే కాదు, వారు ప్రధానాలయాలలో ఉన్నపుడే సంస్కరణ అవుతుంది. అది ఈ కులాలందరికి హక్కు అని ఆయన అన్నారు.
కేరళలో…
నిజానికి, బ్రాహ్మణేతరులను అర్చకులులగా నియమించడం కేరళలో ముందుంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం 2017లోనే 36 మంది బ్రాహ్మణేతర పండితులను అర్చకులుగా నియమించి ఒక నిశబ్దవిప్లవానికి బాట వేసింది. ఇందలో ఆరుగురు ఎస్ సి పండితులున్నారు.ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో ఈ నియమకాలు జరిగాయి. రాష్ట్రంలో దాదాపు 3000 అర్చకుల ఖాళీలున్నాయని, మరికొంత బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడం జరగుతుందని ఈ నియామకాలను వెల్లడిస్తూ దేవస్వం మంత్రి కడకపల్లి సురేంద్రన్ ఆరోజే చెప్పారు. కేరళ ప్రభుత్వం నియమాక ఉత్తర్వుల ప్రకారం యదు క్రిష్ణన్ మొట్టమొదటి ఎస్ సి అర్చకుడయ్యారు.మణప్పురం లోని శివాలయం గర్భగుడిలో అర్చకుడిగా ఆయన నియమితులయ్యారు. అయ్యప్ప గుడిలో కూడా బ్రాహ్మణేతర అర్చకులను నియమించే విషయం కూడా పరిశీలిస్తామని కూడా ఆయన చెప్పారు. కాకపోతే, ఎపుడు ఎలా అనేవిషయాలు చెప్పలేదు. ఇలాంటి విషయాలలో తొందరపాటు తగదని మంత్రి సురేంద్రన్ అన్నారు. కేరళలో అర్చకుల ఉద్యోగాలలో ఎస్ సి, ఎస్ టి, బిసిలకు 32 శాతం రిజర్వేషన్లు న్నాయి.
ఆంధ్రలో…
బ్రాహ్మణేతరులను పూజారులా నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు రెండు వందల మంది ఎస్ సి ఎస్టి, మత్య్సకారుల యువకులు అర్చకత్వ నిర్వహణలో శిక్షణ ఇచ్చింది. వారి శిక్షణ కూడా పూర్తయింది. మిగతా రాష్ట్రాలకు, ఆంధ్ర ప్రదేశ్ ఆలయ సంస్కరణలలో తేడా ఉంది. అక్కడి వారు అర్చక ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించ వారిని ప్రభుత్వాదీనంలో ఉండే గుడులలో అర్చకులుగా నియమిస్తున్నారు. టిటిడి నియమాకం దీనికి భిన్నంగా ఉంటుంది. దేవస్థానం రాష్ట్రంలోని దళిత వాడల్లో, గిరిజన ప్రాంతాలలో, మత్య్స కారుల కాలనీలలో ఆలయాలను నిర్మిస్తున్నది.
ఇందులో దాదాపు సగం తయారయ్యాయి. ఈ అట్టడుగు జాతుల కాలనీలో నిర్మించిన ఆలయాలలో అర్చకులుగా పనిచేసేందు బ్రాహ్నణులెవ్వరూ ముందుకు రావడం లేదు. అందుకే అట్టడుగుకులాల వారి ఆలయాలలో అట్టడుగు కులాల అర్చకులను నియమించాలనుకుంటున్నారు. అంటే పట్టణాలలో నగరాలలో డబ్బున్నవారు, అగ్రకులాల వారు సందర్శించే ఆలయాలలో దళిత,గిరిజను అర్చకులుగాఉండరన్న మాట. ఈ నియమాకాలు పెద్ద వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఇందులో రెండు అంశాలున్నాయి. ఈ వర్గాల ప్రజలున్న కాలనీలలో ఏర్పాటయ్యే టిటిడి గుడులకు అర్చకులుగా వెళ్లడానికి బ్రాహ్మణలు విముఖంగా ఉండటం, రెండు సమాజంలో సంస్కరణల పేరుతో దళిత, గిరిజన పూజారులంటూనే మరొక విభజన తీసుకువచ్చేందుకు టిటిడి పూనుకోవడం.
ఈకాలనీల గుడులకు బ్రాహ్మణులెందుకు వెళ్లరు? ఆగమశాస్త్రోక్తంగా అర్చక విధివిధానాలలో శిక్షణ పొందాక, అర్చకుడిగా పనిచేసేందుకు అర్హత పొందాక బ్రాహ్మణేతరులను ప్రధాన గుడులలో నియమించకపోవడం తప్పే అవుతుంది. ఈ నియమాకాలు ఎలాంటి గొడవకు దారితీస్తాయో చూడాలి.