రాయలసీమకు అన్ని రంగాలలో జరిగింది రాజకీయ ద్రోహమే!

 

(యనమల నాగిరెడ్డి)

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏనాయకుడు గద్దె నెక్కినా కరువుసీమ కన్నీటి వ్యధలు తీరలేదు.మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సమయంలో కుదిరిన “శ్రీభాగ్ వప్పందం” అమలుకాలేదు. సమైక్య రాష్ట్రానికి సీమవాసులే అధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నా, 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా సీమకు చెందిన నాయకులే అన్ని పార్టీలలో ముఖ్య స్థానాలలో ఉన్నా సీమ కు విభజన పరిహారం ఏరూపంలోనూ అందలేదు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును సీమ వాసులకు కూడా వర్తింప చేయడానికి వారికి కనీసం తాగు నీరు, ఒక ఆరుతడి పంటకు సాగు నీరు అందించాలనేది ఈ ప్రాంతం నుంచి వినిపిస్తున్ననినాదం. అసలు రాయలసీమ సమస్య లకు మూలం ఏమిటి? ఒక పరిశీలన.

 

 

కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూర్ జిల్లాలతో కూడిన రాయలసీమ ఒకప్పుడు రతనాలసీమగా వెలుగొందినా, ప్రస్తుతం కరువుసీమగా నిరంతరం రోదిస్తున్నది.

వర్షాధారంపై ఆధారపడిన రైతాంగం ఈ ప్రాంతంలో పడుతున్న అకాల వర్షాలు, వర్షాలు లేకపోవడం, ఎండిపోతున్న బావులు, గొట్టపుబావులు, పెళ్లాల పుస్తెలమ్మి, అప్పులు చేసి సాగుచేసిన పంటలు చేతికి రాకపోవడం, ధరలు లేక దళారుల చేతిలో చిక్కి అల్లడుతున్న ఈ ప్రాంత రైతుల జీవితాలు నానాటికీ ఛిద్రమౌతున్నాయి..

పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేక, బ్రతకడానికి మరోమార్గం లేక రైతులు, కూలీలు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడబిడ్డలను “రెడ్ లైట్” ఏరియాలకు అమ్ముతున్న దుస్థితి కూడా ఉంది. జనం తాగు నీటికి కటకటలాడుతూ , సాగునీటికోసం ఎలుగెత్తి రోధిస్తున్నా, “చెవిటి ముందు శంఖమూదినట్లుంది” తప్పా నాయకమన్యులకు చీమకుట్టి నట్లు కూడా లేదు.తమ ఓటు బాంక్ రాజకీయాలలో నిరంతరం మునిగితేలుతున్న నాయకులకు సీమ గోడు వినిపించడంలేదు.

2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో రాయలసీమ(చిత్తూరు) కు చెందిన నారా చంద్ర బాబు నాయుడు టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తూ తన స్తానో పదిలం చేసుకోడానికి చక్రం తిప్పుతున్నారు.అలాగే వైస్సార్ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రాకులాడుతున్నారు. ఈయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని విభజించి అన్ని రకాల నాశనమై, ప్రస్తుతం అస్తిత్వం కోసం టీడీపీ ముంగిట సాగిలపడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాకు చెందినవాడు.

రాష్ట్ర విభజన తప్పదని ఖచ్చితమని తెలిసి కూడా సీమ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రం విడిపోకూడదని ప్రజల చేత ఉద్యమాలు చేయిస్తూ సీమ సమస్యలను గాలికి వదిలారు. అదేసమయంలో కోస్తా నాయకులు పోలవరం తో పాటు, వారి ప్రాంతానికి అవసరమైన అనేకం విభజన బిల్లులో చేర్చుకున్నారు.

అయితే సీమ నాయకులు రాయలసీమ నీటిరంగానికి అత్యవసరమైన “దుమ్ముగూడెం–నాగార్జునసాగర్ టైల్ పాండ్” ప్రాజెక్టును గురించి కానీ, సీమలో నిర్మాణంలో ఉన్న “గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ”ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు, నిధుల సాధనకు, ఈ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి అవసరమైన నీటి కేటాయింపుల గురించి ఏ నాయకుడు(అన్ని పార్టీల వారు) నోరు కూడా విప్పలేకపోయారు. కేంద్ర నాయకులు నోరు విప్పి సూచనలు చేసినా ఈ ఘనులు పట్టించుకోలేదు.

ప్రజలకోసమే తాము అన్న కమ్యూనిస్టులు, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అన్న బీజేపీ కూడా కోస్తా రాగం తీశాయి కానీ సీమను గురించి నోరు కూడా విప్పకపోవడం దారుణం.ఓట్ల కోసమూ, సీట్ల కోసము కోస్తా అనుగ్రహం కోసం ప్రాకులాడుతూ ఈ నాయకులెవరూ ఇప్పుడు కూడా సీమ సమస్యలపై నోరు మెదపడం లేదు.

రాజధాని

మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సీమకు, కొస్తాకు చెందిన పెద్దమనుషుల మధ్య కుదిరిన ఒప్పందం ” శ్రీభాగ్ ఒడంబడిక”.ఈ ఒప్పందం మేరకు రాజధాని కానీ, హైకోర్టు కానీ సీమ వాసుల కోరిక మేరకు రాయలసీమలో ఏర్పాటు చేయాల్సివుంది.1954లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే 2014లో విభజన తర్వాత ఆనాటి పాత రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రాజధాని తమకే దక్కుతుందని సీమ వాసులు బ్రమపడ్డారు.అయితే సీమలో పుట్టి పెరిగిన ముఖ్యమంత్రి చంద్రన్న విజయవాడలో రాజధాని అని ప్రతిపాదించిన వెంటనే, ‘దొనకొండ రాగం’ తీసిన మరో సీమ బిడ్డ జగనన్న అందుకు మద్దతు పలికి సీమ వాసుల ఆశలకు శాశ్వతంగా సమాధి కట్టారు. మిగిలిన పార్టీల నాయకులు, సీమ ఉద్యమకారులు, సీమకు జరిగిన అన్యాయం గురుంచి నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం ఈ ప్రాంత దౌర్భాగ్యం.

బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ –నీటి కేటాయింపులు

నీటి కేటాయింపుల విషయానికి వస్తే ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. శ్రీభాగ్ వప్పందం మేరకు సీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరపాల్సివుంది. అయితే ఇందుకు విరుద్ధంగా నీటి కేటాయింపులు జరిపి సీమను శాశ్వత కరువు కేంద్రంగా నిలిపారు. సమైఖ్య రాష్ట్రంలో సీమకు కేటాయించిన 124 టి.ఎం.సి ల నీటిని గత 60 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి పూర్తిగా సరఫరా చేయలేకపోవడం పాలకుల కుటిల నీతికి తార్కాణంగా నిలుస్తుంది.

భచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులలో సీమకు న్యాయం చేయకపోయినా, మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ రాష్ట్రానికి కల్పించింది. అయితే పాలకులు ఈ అవకాశాన్ని ఉపయోగించి సీమ అవసరాలు తీర్చకపోగా, కోస్తా ప్రాంత అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

 

ఇటీవల బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ నీటి పంపకాలపై ఇచ్చిన తీర్పు సీమలో నీటిపారుదల ఆశలను సమాధి చేసింది.

కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి పంపకాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం కరువుసీమ (హక్కు లేని) నీటి వాడకాన్ని భూతంలా చూపిస్తున్నది.

కాగా ఏపీ ప్రభుత్వం తన వాదనలో కోస్తా అవసరాలకు ప్రాధాన్యమిస్తూ సీమ నీటి అవసరాల గురించి ప్రస్తావించడమే లేదని సీమ ఉద్యమ నాయకులు వాపోతున్నారు.

సీమ నీటి అవసరాలు తీర్చడానికి 300 టి.ఎం.సి లు అవసరమని, తమప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీమ నీటి అవసరాలు తీరుస్తామన్న బీజేపీ కానీ, ఈ పాపానికి ప్రాణం పోసిన కాంగ్రెస్ కానీ, సీమపై నిరంతరం మొసలి కన్నీరు కారుస్తున్న కమ్యునిస్టులు కానీ నోరు విప్పి, ప్రభుత్వంపై వత్తిడి కల్పించక పోవడం శోచనీయం.

 

పట్టిసీమ… పోలవరం.. సీమ పాలిట ఎండమావే

పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ల ద్వారా వస్తున్న గోదావరి నీరు సీమకే అంటున్న చంద్రబాబు అందుకు అవసరమైన జి.ఓ లు మాత్రం ఇవ్వడం లేదు. ప్రకటనలకు పరిమితమైన “పోలవరం నీరు సీమకే” అన్న ప్రకటన సీమ పాలిట ఎడారిలో ఎండమావే నని చెప్పక తప్పదు.

చంద్రబాబు సీమలో “నీటి కేటాయింపులు లేని” ఎన్ని ప్రాజెక్ట్ లను ప్రారంభించినా అవి ఆయన తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమేనని, శాశ్వతంగా సీమ నీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడవని కూడా చెప్పక తప్పదు.

2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం కోస్తా జిల్లాల్లో అనేక ప్రాజెక్టులు చేపట్టి అధిక నిధులు కేటాయించి, యుద్ధప్రాతిపదికన పని చేస్తూ, 80 నుంచి 90 శాతం పూర్తి అయిన సీమ ప్రాజెక్టలపై సవితితల్లి ప్రేమ చూపిస్తున్నా ఏ పార్టీ పట్టించు కోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

మన్నవరం… కడప ఉక్కు

గతంలో చిత్తూరులో ప్రారంభమైన మన్నవరం ప్రాజెక్ట్ కు అతీగతి లేదు. ఈ ప్రాజెక్ట్ తరలి పోతుందని వార్తలు వస్తున్నా రాజకీయ పార్టీలలో చలనం లేకపోయింది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో నాయకులు రాజకీయాలు చేయడంలోనే తలమునకలుగా ఉన్నారు.

కేంద్రం నియమించిన కమిటీ అంగీకరించిందని, సాక్షాత్తు ప్రధాని ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారని బీజేపీ నాయకులు ప్రకటనలు గుప్పిస్తున్నారు.

కేంద్రం రెండు నెలల్లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే రాష్ట ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తుందని ప్రకటించి మూడు నెలలైనా పట్టించుకోని ముఖ్యమంత్రి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకిలా…

సీమలో జనం రెండు వర్గాలుగా విడిపోయి ఎవరో ఒకరి పంచన ఉన్నారని, పాలక, ప్రతిపక్షాలలో ఎవరో ఒకరికి ఓటు వేస్తారని, వారిని పట్టించుకున్న , పట్టించుకోకున్నా సమస్య లేదన్నది మన నాయకమన్యుల నిశ్చితాభిప్రాయం.

ఇక్కడ ఉన్నది కేవలం 52 సీట్లు మాత్రమే. పైగా సీమను అభివృద్ధి చేసినా, చేయకున్నా ప్రజలు తమదైన శైలిలో తమకు మద్దతు పలుకుతారని అందువల్ల తమకు నష్టం లేదన్న ధీమాతో రెండు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఉన్నారు. ఇక్కడ తామెలాగు పొడిచేది ఏమిలేదని జాతీయ పార్టీలు సన్నాయి నొక్కులు మాత్రమే నొక్కుతున్నాయి.

కోస్తా ప్రాంతంలో 120కి పైగా సీట్లు ఉన్నాయని, వారి అవసరాలు తీర్చకపోతే వారు తమ తాట వలుస్తారనే విషయం పై పూర్తి అవగాహన ఉన్న ఈ నాయకులు వారి అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇస్తూ సీమ గొంతు కోస్తున్నారు.

జననీ జన్మభూమిశ్చ

జననీ జన్మభూమిశ్చ అంటూ సుదూర ప్రాంతాలలో ఉంటున్న వారిని ” జన్మభూమి రుణం తీర్చుకొండని” బ్రహ్మాండమైన సభలు పెట్టి ఆహ్వానిస్తున్న ఈ నాయకులు మాత్రం తమ రాజకీయ ప్రాబల్యం కోసం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు.

రాజకీయాలాట కొంత పక్కన పెట్టి ఇకనైనా ఈ ప్రభువులు సీమ గోడు పట్టించుకోవాలని, ప్రజలకు గుక్కెడు మంచినీరు, ఆరుతడి పంటకు సాగు నీరు అందివ్వాలని ఉద్యమ నేతలు, ప్రజలు కోరుతున్నారు.