వైనాట్ 175… లక్ష్యం దిశగా వైసీపీ మరో అడుగు!

అధికార వైసీపీ ఎన్నికల మూడ్‌ లోకి వెళ్లింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోపక్క టీడీపీ – జనసేన అధికారికంగా పొత్తు ప్రకటన చేసి, ఉమ్మడి ప్రాణాళికలు రచిస్తున్నాయ్యి. ఇదే క్రమంలో నవంబర్ 1 న ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సమయంలో వైసీపీ కూడా ముందుగా ప్రకటించినట్లుగానే ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది.

మరో నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి గెలుపు అనేది రెండు పార్తీలకూ అత్యంత కీలకం. ఈ ఎన్నికల తర్వాత ఏపీలో ఒకటి రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయనే కామెంట్లు సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో… ఈసారి ఎన్నికలు అత్యంత కీలకం. అందుకోసమే… టీడీపీ – జనసేనలు కలిసి తాడో పేడో తేల్చాలని భావిస్తున్నాయని అంటున్నారు.

మరోపక్క వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ క్యాడర్‌ తో పలుదఫాలుగా సమావేశం అయ్యారు. ఇదే సమయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఇందులో భాగంగా… ప్రతీ ఎమ్మెల్యేనీ ఇంటింటికీ పంపించారు. సంక్షేమ పథకాల అమలు తీరు, పార్టీ నాయకులపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను నేరుగా వారి నుంచే తీసుకోవడానికి ప్రయత్నించారు. అనంతరం జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను నిర్వహించారు.

వాటికి జనాల్లో భారీస్థాయిలో ఆదరణ లభించింది! ఇదే సమయంలో జగన్ మరో ఆలోచన చేశారు. అదే సామాజిక సాధికార యాత్ర అని పేరున బస్సు యాత్రను చేపట్టాలని. ఇందులో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒకేసారి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. డిశెంబర్ వరకూ ఇది కొనసాగుతుంది.

ఇందులో భాగంగా… ఈ నెల 26వ తేదీన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా – ఇచ్చాపురం.. కోస్తాంధ్రలో గుంటూరు జిల్లా – తెనాలి.. రాయలసీమలో అనంతపురం జిల్లా – శింగనమల నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ బస్సు యాత్రలు ప్రారంభమౌతాయి. వీటిలో ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు.

ఇలా ఈ నెల 26న ప్రారంభమైన యాత్ర ఉత్తరాంధ్రలో 27వ తేదీన గజపతినగరం, 28వ తేదీన భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4వ తేదీన శృంగవరపుకోట (ఎస్ కోట), 6వ తేదీన గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9వ తేదీన అనకాపల్లి నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇక కోస్తాంధ్ర విషయానికొస్తే… 26న తేనాలిలో మొదలవుతుంది.

అనంతరం… 27వ తేదీన నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవంబరు 1వ తేదీన కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు, 6న రాజమండ్రి రూరల్, 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని చెబుతున్నారు! ఇదే సమయంలో… రాయలసీమలో 26న అనంతపురం జిల్లా శింగనమలలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

అనంతరం… 27వ తేదీన తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3వ తేదీన శ్రీకాళహస్తి, 4వ తేదీన ధర్మవరం, 6న మార్కాపురం, 7వ తేదీన ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9వ తేదీన తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ సుమారు 60 రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు.