చనిపోయినా వైసీపీ పథకాలు, పింఛన్లు అందుతున్నాయట.. ఇదేం విచిత్రమో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ తాము అర్హులైనా పథకాలను, పింఛన్లను అందజేయడం లేదని ప్రతిరోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అర్హతలు ఉండి కూడా పింఛన్లు పొందలేక, వేర్వేరు సమస్యల వల్ల సంపాదించే శక్తి లేక రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు బెనిఫిట్ కలుగుతున్నా ప్రభుత్వం నియమనిబంధనల వల్ల కొంతమంది పేదవాళ్లైనా పథకాలు పొందలేకపోతున్నారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలలో కేంద్రానికి సంబంధించిన నిధులు సైతం ఉన్నాయి. అయితే తాజాగా ఏపీలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. కృష్ణా జిల్లాలోని గురజాడలో రాజులపాటి సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. అయితే ఆయనకు వైఎస్‌ఆర్‌ పింఛను కానుక రూపంలో 33,500 రూపాయలు, పీఎం కిసాన్ రైతు భరోసా కింద 34,500 రూపాయలు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఈ విషయాలు తెలిసి చనిపోయిన వ్యక్తి కుమారుడు సైతం ఆశ్చర్యపోయారు. మంత్రి జోగి రమేష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించగా ఆ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి వాలంటీరును వివరణ కోరగా అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి పింఛన్, రైతు భరోసా పొందుతున్నాడని తేలింది. ఆ మాత్రం అవగాహన లేకుండా వాలంటీర్ డబ్బులు ఎలా ఇచ్చాడని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి ఘటనల వల్ల వైసీపీ పరువు పోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎంపీడీవో ఏవీ నాంచారావు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. వైసీపీ సర్కార్ చిన్నచిన్న తప్పుల వల్ల పరువు పోగొట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉన్నా ఈ తరహా తప్పులు రిపీట్ అవుతుండటం గమనార్హం.