చంద్రబాబుపై ఆగ్రహం, ముద్రగడ కీలక నిర్ణయం

 

కాపు ఉద్యమనేత ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాన్నీ తెలిపారు. ఆంధ్ర రాజకీయ పార్టీలు కాపుల మద్దతు కూడగట్టుకోవడానికి అనేక కసరత్తులు చేస్తున్నాయి. పైగా కాపు సామజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ అంశంపై నేతల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.

ఈ ఉత్కంఠకు త్వరలోనే తెర దించనున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ కాపులకు పూర్తి న్యాయం చేస్తారని నమ్మకం కల్పించేవారికే తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ మేరకు డిసెంబరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు మీడియాతో తెలిపారు.

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనే అంశంపై ఇప్పటికే కాపు జేఏసీ నాయకులతో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు జేఏసీ నాయకులతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు ముద్రగడ. వచ్చే నెలలో రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు నాయకులతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

చంద్రబాబును అనేకసార్లు కాపులకు న్యాయం చేయమని కోరినట్టు తెలిపారు. పలుమార్లు కాపు యువకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరినా ఆయన రెస్పాండ్ అవలేదన ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలో నైనాల హరిశ్చంద్రప్రసాద్ నివాసంలో ముద్రగడ ఆదివారం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

చంద్రబాబును ప్రకటించిన హామీలనే అమలు చేయమని అడుగుతుంటే ఆయన ఇదేదో పెద్ద నేరంగా చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయని అయితే ఈలోపు కాపు రిజర్వేషన్ వస్తుందని ఆశించమని తెలిపారు. బీసీ లకు రిజర్వేషన్ శాతం పెంచినప్పటికీ మాకు అభ్యంతరం లేదని, కాపులకు ఇచ్చే కోట మాత్రమే అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నట్టు ముద్రగడ పద్మనాభం తెలిపారు.