పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిలో మీడియాలో సమావేశంలో జగన్ మాట్లాడారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, ప్రజాస్వామ్యం లేదని అనడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు. ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదంటూ వ్యాఖ్యానించారు.
పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్ చేశారని జగన్ ఆరోపించారు. పోలీసులు దగ్గరుండి ఏజెంట్లను బూత్ లోపలికి పంపలేదని విమర్శించారు. ఏజెంట్‌ను బూత్ లోపలికి రానివ్వకుండా దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసేశారు.. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిన పరిస్థితి దేశంలో ఎక్కడ చూడలేదని జగన్ విమర్శించారు.
పోలింగ్ పక్రియలో పాటించాల్సిన నియమాలేవి పాటించలేదన్న జగన్.. ఓటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి బ్యాలెట్ బాక్స్ సీల్ వేసేవరకూ ఏజెంట్ ఉండాలి. అసలు ఏజెంట్ లేకుండా పోలింగ్ జరిగితే అది ఎన్నిక అవుతుందా.. ఇలానే ఎన్నికలు జరిపితే ఎన్నికలు అనే ప్రక్రియ హాస్యాస్పదం అవుతుంది. ఎన్నికలు ఇలా జరపడం కంటే మానేయడం బెటర్ అని జగన్ అన్నారు.
ఇష్టం వచ్చినట్టు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. దారికాచి ఓటర్లని అడ్డుకుని స్లిప్పులు లాక్కున్నారని ఆరోపించారు. భద్రత పేరుతో వందలాది పోలీసులను పెట్టి ఓటర్లని భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, అనంతపురం నుండి టీడీపీ రౌడీలు వచ్చారు. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారన్న జగన్.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా.. అంటూ ప్రశ్నించారు.
2017 నంద్యాల ఉపఎన్నికల్లో ఇలానే అరాచకాలు చేశారు.. గెలిచామని సంకలు గుద్దుకున్నారు. సరిగ్గా ఏడాదిన్నరలో నంద్యాలతోసహా చంద్రబాబు పార్టీని భూస్థాపితం చేశామన్నారు. మరో మూడేళ్లలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావు అని జనగ్ తెలిపారు.. జరగబోయేది ఇదే.. ఇదే వాస్తవం.. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ అన్నారు. అందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.. కాపాడుకోకపోతే నక్షలిజం పుడుతుంది. తక్షణమే రెండు ఎన్నికలు రద్దు చెయ్యాలి. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపాలి. చంద్రబాబు జీవితానికి ఇవే చివరి ఎలక్షన్స్ అనుకుంటా.. కృష్ణా రామా అనుకుంటూ ఉండాలి.. ఇలాంటి దుర్మార్గాలు చెయ్యకూడదు.. ఇలానే చేస్తే నరకానికి పోతావ్ అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ జగన్ వ్యాఖ్యానించారు.
